తాలిబన్ల రాజ్యంలో ఐసిస్ దాడులు!

August 27, 2021


img

తాలిబన్ల రాజ్యంలో మరో తీవ్రవాద సంస్థ ఐసిస్ నిన్న ఆత్మహుతి దాడులు చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. నిన్న జరిగిన దాడులలో 12 మంది అమెరికా సైనికులతో సహా మొత్తం 72 మంది చనిపోయారు. మరో 143 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన, చనిపోయిన వారిలో కొందరు తాలిబన్లు కూడా ఉన్నారు. కనుక ఈ బాంబు దాడులను ఖండిస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. 

 తాలిబన్లు ఎంత రాక్షసంగా ప్రవర్తిస్తారో ఐసిస్ తీవ్రవాదులు కూడా అలాగే ప్రవర్తిస్తుంటారు. ఇప్పుడు తాలిబన్ల రాజ్యంలో ఐసిస్ తీవ్రవాదులు ఆత్మహుతి దాడులు చేయడంతో బహుశః తాలిబన్లకు, వారికీ మద్య మరో కొత్త యుద్ధం ప్రారంభం అయినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే తాలిబన్ల రాకతో తీవ్ర సంక్షోభంలో చిక్కుకొన్న ఆఫ్ఘనిస్తాన్‌లో ఈ రెండు తీవ్రవాద సంస్థల మద్య యుద్ధం మొదలైతే ఇక ఆఫ్ఘనిస్తాన్‌... సామాన్య ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. 

అయితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నిన్న దాడులు జరిపిన ఐసిస్-కె తీవ్రవాదులు తాలిబన్లకు అనుబందంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. వారిని వేటాడి హతమార్చి తీరుతామని జో బైడెన్‌ హెచ్చరించారు. అంటే తాలిబన్లపై అమెరికా మరోసారి విరుచుకుపడబోతోందని స్పష్టం అవుతోంది. కనుక ఏవిదంగా చూసినా ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదమే కనిపిస్తోంది. 

విషాదకరమైన విషయం ఏమిటంటే, అనేక ఏళ్ళుగా ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లతో పోరాడుతూ శాంతిస్థాపనకు దోహదపడిన అమెరికా సైనికులు మరో నాలుగు రోజులలో స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయేందుకు సిద్దంగా ఉన్నారు. తమ కుటుంబాలను కలుసుకొనేందుకు వారు, అక్కడ అమెరికాలో వారి కోసం వారి కుటుంబాలు ఆత్రంగా ఎదురుచూస్తుండగా నిన్న జరిగిన దాడిలో 12 మంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 


Related Post