తెలంగాణ రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్న వైఎస్సార్‌టిపి అధినేత్రి వైఎస్ షర్మిల, వచ్చే శాసనసభ ఎన్నికలలో తమ పార్టీ గెలిచి అధికారంలోకి రాబోతోందని, కావాలంటే ఇప్పుడే రాసి పెట్టుకోండని చాలా నమ్మకంగా చెపుతున్నారు. ఆమె నమ్మకానికి కారణం ఏమిటో తెలియదు కానీ వచ్చే శాసనసభ ఎన్నికలలో ప్రముఖ ఎన్నికల నిపుణుడు ప్రశాంత్ కిషోర్ సేవలను ఉపయోగించబోతున్నట్లు తాజా సమాచారం. అయితే ఈ వార్తను వైఎస్సార్‌టిపి ఇంకా దృవీకరించవలసి ఉంది. ఒకవేళ ఆయన బృందం వైఎస్సార్‌టిపికి పనిచేయడం నిజమైతే, వైఎస్ షర్మిల రాజకీయాలను చాలా సీరియస్‌గానే తీసుకొని పనిచేస్తున్నారని భావించవచ్చు. ప్రశాంత్ కిషోర్ ఇకపై ఏ పార్టీ కోసం పనిచేయనని ప్రకటించినప్పటికీ, ఇదివరకే వైఎస్సార్‌టిపితో ఒప్పందం చేసుకొన్నందున ఆ పార్టీకి పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది.
గతంలో ప్రశాంత్ కిషోర్ ఏపీలో వైసీపీకి పనిచేసి ఆ పార్టీకి విజయం దక్కేలా చేశారు. ఎప్పటికైనా ఏపీకి ముఖ్యమంత్రి అవ్వాలనే జగన్‌మోహన్‌రెడ్డి కోరికను తీర్చుకోవడానికి ప్రశాంత్ కిషోర్ దోహదపడ్డారు. ఇప్పుడు జగన్ సోదరి వైఎస్ షర్మిలకు పనిచేయబోతుండటం నిజమైతే, టిఆర్ఎస్ పార్టీకి మరో బలమైన రాజకీయ శత్రువు తయారైనట్లే భావించవచ్చు.