రాష్ట్రంలో దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసమని తన పదవికి రాజీనామా చేసిన ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్, తన భావజాలానికి అనుకూలంగా ఉన్న బీఎస్పీలో చేరారు. ఆ తరువాత ఆ పార్టీ సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటూ రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, బహుజనుల రాజ్యం ఏర్పడుతుందని చెప్పడాన్ని కూడా ఎవరూ తప్పు పట్టలేరు. కానీ ఓ ఐపీఎస్ అధికారిగా ఉన్నత పదవులలో పనిచేసిన ప్రవీణ్ కుమార్ రాజకీయాలలో ప్రవేశించగానే హుందాతనం కోల్పోయి, అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలను ఉద్దేశ్యించి దొంగలు, దోపిడీదారులు, పందికొక్కులు అంటూ మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాగే రాజకీయాలలో ప్రవేశించి నెలరోజులు తిరక్కమునుపే...రెండేళ్ళలో అధికారంలోకి వస్తామని, ఏనుగు అంబరీ ఎక్కి ప్రగతి భవన్‌కు వెళతామని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది.
రాష్ట్రంలో అసలు బీఎస్పీ అనే ఓ పార్టీ ఉందనే సంగతి చాలా మంది ప్రజలకు తెలియదు. ఒకవేళ తెలిసి ఉన్నా మూడు ప్రధాన పార్టీల మద్య చీలిపోయున్న ప్రజలు వాటికే ఓట్లు వేస్తుంటారు తప్ప బీఎస్పీకి వేసిన దాఖలాలు లేవు. అందుకే అటువంటి ఉనికే లేని పార్టీ ప్రవీణ్ కుమార్ సభల ద్వారా ప్రజలకు పరిచితమవుతోంది. ఇది మంచి ఆలోచనే కానీ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకుపోయే ప్రయత్నం చేయకుండా తాను, తన పార్టీ కేవలం బహుజనులకు సంబందించినట్లు, దానిలో ఇతరులకు ప్రవేశం లేదన్నట్లు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు. అలాగే ఆయన ఆవేదన నుంచి పుట్టిన ఆవేశంతో మాట్లాడుతున్న మాటలు సమాజంలో మిగిలిన వర్గాలకు అసహనం కలిగిస్తాయనే సంగతీ మరిచినట్లున్నారు. దీని వలన బీఎస్పీకే నష్టమని ఆయన గ్రహిస్తే మంచిది.
టిఆర్ఎస్ ధాటికి జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలే నిలువలేకపోతున్నాయి. మరి టిఆర్ఎస్‌తో సహా కాంగ్రెస్, బిజెపిలను కూడా బీఎస్పీ ఏవిదంగా ఎదుర్కోగలదు? వాటిని ఓడించి అధికారంలోకి ఏవిదంగా రాగలదు? అని ఆలోచిస్తే ఆయన ఈవిదంగా మాట్లాడటం చాలా తొందరపాటని స్పష్టమవుతుంది.
కనుక ఈవిదంగా సభలలో అత్యుత్సాహం, ఆవేశంతో మాట్లాడే బదులు తమ పార్టీ ఆశయాలు, కార్యాచరణ ఏమిటో ప్రజలకు వివరించి అందరినీ కలుపుకుపోయే ప్రయత్నాలు చేస్తే మంచిది. అలాగే గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణం చేసుకొంటే ఏమైనా ఉపయోగం ఉంటుంది. లేకుంటే బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా వచ్చిన ప్రవీణ్ కుమార్ కూడా రాష్ట్రంలో ఉన్న అనేకమంది అనామక రాజకీయ నేతలలో ఒకరిగా మిగిలిపోవడం ఖాయం.