రేవంత్‌ రెడ్డికి మంత్రి మల్లారెడ్డి సాయంత్రం వరకు గడువు

August 26, 2021


img

పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి బుదవారం మూడుచింతలపల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవదీక్ష ముగిస్తూ సిఎం కేసీఆర్‌, మంత్రులు మల్లారెడ్డి, కేటీఆర్‌లపై తీవ్ర విమర్శలు ఆరోపణలు చేశారు. వాటిపై కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి స్పందిస్తూ తొడగొట్టి ఇద్దరం రాజీనామాలు చేసి మళ్ళీ పోటీ చేసి తేల్చుకొందామని సవాలు విసిరారు. మళ్ళీ ఇవాళ్ళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “రేవంత్‌ రెడ్డికి విసిరిన సవాలుకి నేను కట్టుబడి ఉన్నాను. ఆయనకి దమ్ముంటే నా సవాలును స్వీకరించి తన పదవికి రాజీనామా చేసి నాతో పోటీకి సిద్దం కావాలి. ఈరోజు సాయంత్రం వరకు ఆయనకు గడువు ఇస్తున్నాను,” అని అన్నారు.   

రాజకీయాలలో ఇటువంటి తాటాకు చప్పుళ్ళు తరచూ వినబడుతూనే ఉంటాయి. వాటితో మీడియాకు, ప్రజలకు, పార్టీలకు కాలక్షేపం తప్ప మరేమీ ఉండదు. పిసిసి అధ్యక్ష హోదాలో రేవంత్‌ రెడ్డి, మంత్రి హోదాలో మల్లారెడ్డి మాట్లాడుతున్న మాటలు ఏమాత్రం హుందాగా లేవని చెప్పక తప్పదు. వాటితో వారు పరస్పరం బయటపెట్టుకొంటున్న  వ్యక్తిగత విషయాలు, అవినీతి భాగోతాలు చూసి ప్రజలు విస్మయం చెందుతున్నారు. వారిరువురి గురించి ఇంతవరకు తెలియని కొత్త విషయాలు ప్రజలు తెలుసుకొంటున్నారు. దీని వలన ప్రజల దృష్టిలో వారిరువురూ మరింత పలుచన అవుతారు. అందుకే రాజకీయాలలో హుందాతనం పాటించాలనే మాట తరచూ వినబడుతుంటుంది. 

ఎన్నికలలో పార్టీ టికెట్ల కోసం, గెలిచిన తరువాత పదవుల కోసం ఆరాటపడే నేతలు ఈవిదంగా ఒట్టొట్టి రాజీనామా సవాళ్ళు విసురుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. తమ వలన ఏదైనా పొరపాటు జరిగినప్పుడు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయడానికి వెనకాడే నేతలు, ఇటువంటి సందర్భాలలో రాజీనామా చేస్తామని సవాళ్ళు విసురుతుండటం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. రాజీనామా సవాళ్ళతో తమను ఎన్నుకొన్న ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఏ మాత్రం గౌరవం లేదనే భావన ప్రజలలో కల్పిస్తుంది.


Related Post