హైదరాబాద్ నగరం నడిబొడ్డున గల ట్యాంక్ బండ్ దశాబ్ధాలుగా పర్యాటక ఆకర్షణ కేంద్రంగా ఉంటోంది. అయితే నిత్యం ట్యాంక్ బండ్‌పై నుంచి వేలాది వాహనాలు వెళుతుండటంతో వాటితో పర్యాటకులకు, ట్యాంక్ బండ్‌పై సేద తీరాలని వచ్చే నగరవాసులకు చాలా ఇబ్బంది కలుగుతుంటుంది. ఇదేవిషయం ఓ వ్యక్తి ట్విట్టర్ ద్వారా రాష్ట్ర పురపాలకశాఖా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్ళి ప్రతీ ఆదివారం సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు ట్యాంక్ బండ్ మీదుగా వాహనాల రాకపోకలను నిషేధిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. దానిపై సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్, నగర పోలీస్ కమీషనర్‌ను తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరారు. కేటీఆర్ ఆదేశం మేరకు ట్యాంక్ బండ్‌కు ఇరువైపులా ట్రాఫిక్ డైవర్షన్స్ అమలుచేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. బహుశః ఈ ఆదివారం నుంచే ఇవి అమలయ్యే అవకాశం ఉంది.
ఇది మంచి ఆలోచనే కానీ ట్యాంక్ బండ్‌పై ఒకటిన్నర కిలోమీటర్లు ప్రయాణిస్తే నగరవాసులు అవతలివైపు గమ్యస్థానాలు చేరుకోవచ్చు. కానీ ఇప్పుడు మరో 5-10 కిమీలు లేదా అంతకంటే ఎక్కువ దూరమే చుట్టూ తిరిగుతూ ట్రాఫిక్ సిగ్నల్స్ దాటుకొంటూ ప్రయాణించడం చాలా కష్టమవుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు నానాటికీ పెరిగిపోతున్న ఈ రోజుల్లో నగరవాసులకు ఇది చాలా ఇబ్బందికరమే. కనుక నగరవాసులకు, పర్యాటకులకు కూడా ఇబ్బంది లేకుండా ట్యాంక్ బండ్‌పై కొత్తగా ఓ ఫ్లై ఓవర్ నిర్మిస్తే బాగుంటుంది.