సిఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

August 25, 2021


img

వైఎస్సార్‌టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సిఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబన్ల చేతిలో బందీ అయినట్లుగానే తెలంగాణ రాష్ట్రం సిఎం కేసీఆర్‌ చేతిలో బందీ అయిందని వైఎస్ షర్మిల అన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన భూక్యా నరేశ్ నాయక్ అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకొన్నాడు. వైఎస్ షర్మిల నిన్న అతని కుటుంబాన్ని పరామర్శించిన తరువాత మీడియాతో మాట్లాడుతూ సిఎం కేసీఆర్‌ను ఉద్దేశ్యించి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

“ఉద్యమ సమయంలో ముందుండి పోరాడిన యువత తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఏడేళ్ళుగా కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసి చూసి మోసపోయామని గ్రహించి ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. ఏడు రోజుల వ్యవధిలో రాష్ట్రంలో ముగ్గురు నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. ఇవన్నీ సర్కారీ హత్యలే. వారి మరణాలకు సిఎం కేసీఆరే బాధ్యత వహించాలి. ఇంకా ఎంతకాలం ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవాలి? ఇంకా ఎంతమంది చనిపోయాక ప్రభుత్వం స్పందిస్తుంది?మన పిల్లల్ని పెంచి పెద్దచేసి మంచి చదువులు చెప్పించి చంపుకోవడం కోసమేనా మనం కోట్లాడి తెలంగాణ సాధించుకొన్నది?

50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడమే తప్ప నోటిఫికేషన్లు విడుదల చేయరు కానీ హుజూరాబాద్‌ ఉపఎన్నిక రాగానే సిఎం కేసీఆర్‌ హడావుడిగా దళిత బంధు పధకం ప్రకటించి తనను తాను దళిత బంధువుగా అభివర్ణించుకొంటున్నారు. ఏం...దళితులొక్కరే మీకు బంధువులా...నిరుద్యోగులు కారా?ఉద్యోగాల భర్తీ విషయంలో కోర్టులు పదేపదే మొట్టికాయలు వేస్తున్నా ప్రభుత్వంలో చలనం రాదా? టిఆర్ఎస్‌ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలంటే హుజూరాబాద్‌ ఉపఎన్నికలో వందల సంఖ్యలో నిరుద్యోగులు నామినిషన్లు వేయాలి,” అని వైఎస్ షర్మిల అన్నారు.

సూపర్ హిట్ అయిన సినిమాలలో డైలాగులను లేదా వర్తమాన రాజకీయ, సామాజిక సంఘటనలను రాజకీయ నాయకులు ఈవిదంగా వాడుకోవడం సహజమే. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిపదంలో నడిపిస్తున్న ఓ ముఖ్యమంత్రిని తాలిబన్ వంటి తీవ్రవాద సంస్థతో పోల్చుతూ వైఎస్ షర్మిల ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం. 


Related Post