తెలంగాణ బిజెపికి ఏటా సెప్టెంబర్ నెల వస్తే తెలంగాణ విమోచన దినోత్సవం పాట అందుకోవడం పరిపాటిగా మారింది.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళయిన సందర్భంగా ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం ఇతర పార్టీల (మజ్లీస్) ఒత్తిడికి తలొగ్గకుండా సెప్టెంబర్ 17వ తేదీన అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడితే సెప్టెంబర్ 17వ తేదీన అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతామని ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రజలకు మాట ఇచ్చారని దానిని నిలబెట్టుకోవాలని అన్నారు. దేశంలో చిన్న, వెనకబడిన రాష్ట్రాలతో పోల్చుకొంటూ తెలంగాణ ధనిక రాష్ట్రమని, ఆర్ధికంగా బలంగా ఉందని సిఎం కేసీఆర్ గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు.
సెప్టెంబర్ 17వ తేదీన మంత్రులు, ఎమ్మెల్యేలు, టిఆర్ఎస్ నేతలు పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసి తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొంటారు కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించదు. అధికారికంగా నిర్వహిస్తే మిత్రపక్షంగా ఉన్న మజ్లీస్ పార్టీకి ఆగ్రహం కలుగుతుందని అప్పుడు హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా ముస్లింల ఓట్లు టిఆర్ఎస్‌కు పడవనే భయం వల్ల కావచ్చు. బిజెపి నేతలకు ఈవిషయం బాగా తెలుసు గనుకనే దాని కోసం పట్టుపడుతున్నారని భావించవచ్చు. తద్వారా దీనిపై టిఆర్ఎస్ జవాబు చెప్పుకోలేని నిసహాయస్థితిని ఏటా చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు భావించవచ్చు. సెప్టెంబర్ 17 గడిచిపోతే బిజెపి కూడా ఈ విషయం మళ్ళీ ఏడాది వరకు ప్రస్తావించదు. కనుక టిఆర్ఎస్ కూడా బిజెపి ఒత్తిడికి లొంగడం లేదని భావించవచ్చు.