హుజూరాబాద్‌లో ఓడిపోతే ఏమీకాదు: కేటీఆర్‌

August 25, 2021


img

తెలంగాణ భవన్‌లో నిన్న జరిగిన టిఆర్ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ హుజూరాబాద్‌ ఉపఎన్నిక గురించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “సమావేశంలో హుజూరాబాద్‌ ఉపఎన్నిక ప్రస్తావనే రాలేదు. ఎందుకంటే అది మాకు చాలా చిన్న ఎన్నిక. కనుక ప్రతీక్షణం దాని గురించే ఆలోచిస్తూ కూర్చోలేము. ఉపఎన్నిక షెడ్యూల్ ప్రకటించిన తరువాత దాని గురించి ఆలోచిస్తాం. అయినా ఆ ఉపఎన్నికలో ఓడిపోతే మా ప్రభుత్వం పడిపోదు...గెలిస్తే ఢిల్లీలో మాకు అధికారం రాదు. కనుక దాని గురించి మాకు చింత లేదు.. అది ప్రతిపక్షాలకే ఓ సవాలు కనుక దాని గురించి అవే ఆలోచించుకోవాలి,” అని అన్నారు. 

హుజూరాబాద్‌ ఉపఎన్నికకు అందరి కంటే ముందుగా ప్రచారం మొదలుపెట్టి అభ్యర్ధిని కూడా ప్రకటించింది టిఆర్ఎస్‌ పార్టీయే. అలాగే ఉపఎన్నికను దృష్టిలో ఉంచుకొనే మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సుమారు నెలరోజులుగా అక్కడ కూర్చొని చిరకాలంగా పెండింగులో ఉన్న అభివృద్ధి పనులను హడావుడిగా పూర్తి చేయిస్తున్నారు. టిఆర్ఎస్‌ ప్రభుత్వం హడావుడిగా దళిత బంధు పధకం ప్రకటించింది. సిఎం కేసీఆర్‌ స్వయంగా దానిని ఈనెల 16న హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ప్రారంభించారు. ఆ పధకం ప్రారంభించిన పది రోజులు కూడా కాక మునుపే ప్రభుత్వం ఆ ఒక్క నియోజకవర్గంలో దాని కోసం రూ.1,200 కోట్లు విడుదల చేసింది. ఎన్నికలుంటే రైతుబంధు కోసం ఈవిదంగా రాష్ట్రవ్యాప్తంగా నిధులు విడుదల చేసేది తప్ప ఒక నియోజకవర్గంలో ఓ పధకం కోసం ఇంత పెద్ద మొత్తం...ఇంత తక్కువ సమయంలో ఎన్నడూ విడుదల చేసీనా దాఖలాలు లేవు. ఈ ఉపఎన్నికను దృష్టిలో ఉంచుకొనే నియోజకవర్గానికి చెందిన బీసీ, దళిత నేతలకు కీలకపదవులు కట్టబెట్టింది. ఓ పక్క ఇన్ని చేస్తూ ఉపఎన్నిక గురించి అనుక్షణం ఆలోచించనవసరం తమకు లేదని చెప్పడం చాలా హాస్యస్పదంగా ఉంది. తమ పార్టీ గురించి ఇంత గొప్పగా చెప్పుకొని ఇన్ని కోట్లు ఖర్చు చేసిన తరువాత మంత్రి కేటీఆర్‌ నోటి నుంచి ‘ఉపఎన్నికలో ఓడిపోతే ఏమీ కాదని ప్రభుత్వం పడిపోదనే’ మాట వినపడటం ఇంకా ఆశ్చర్యంగా ఉంది. అంటే హుజూరాబాద్‌ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ ఓడిపోతామని భావిస్తోందా? అందుకే టిఆర్ఎస్‌ ముందే ఓటమికి సిద్దపడుతోందా?అనే సందేహం కలుగకమానదు.   



Related Post