రాష్ట్రంలో ఎన్నికలొచ్చినపుడల్లా 50 వేల ప్రభుత్వోద్యోగాల భర్తీపై కమిటీలు, లెక్కలు, నివేదికలు, చర్చలు అంటూ హడావుడి చేయడమే తప్ప ఇంతవరకు నోటిఫికేషన్లు జారీ చేయలేదు. త్వరలో హుజూరాబాద్ ఉపఎన్నిక ఉన్నందునో ఏమో మళ్ళీ దీనిపై అధికారుల హడావుడి మొదలైంది.
ఇదివరకు మంత్రివర్గ సమావేశం జరిగినప్పుడు పది రోజులలోగా శాఖల వారీగా ఖాళీల వివరాలు సమర్పించాలని ఆదేశించగా, అప్పట్లో అధికారులు మొత్తం 52 వేల ఖాళీలున్నట్లు ముసాయిదా నివేదికలు సమర్పించారు. అయితే అవి సమగ్రంగా లేవని మళ్ళీ మరోసారి ఖాళీల వివరాలు సమర్పించాలని సిఎం కేసీఆర్ ఆదేశించడంతో, అధికారులు మళ్ళీ లెక్కలుకట్టి మొత్తం 67,820 ఖాళీలు ఉన్నట్లు తాజా నివేదికలో పేర్కొన్నారు. దీనిని రాష్ట్ర ఆర్ధికశాఖ కూడా దృవీకరించింది. ఈ నివేదికపై త్వరలో జరుగబోయే మంత్రిమండలి సమావేశంలో చర్చించి దానికి ఆమోదముద్ర వేసినట్లయితే నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది.
హుజూరాబాద్ ఉపఎన్నిక ఉన్నందున ఆలోగా ఈసారి తప్పకుండా నోటిఫికేషన్ వెలువడవచ్చు కానీ దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల షెడ్యూల్ ప్రకటన, పరీక్షల నిర్వహణ, ఇంటర్వ్యూలు, నియామకపత్రాల జారీ, ఉద్యోగాల భర్తీ వగైరా ప్రక్రియలన్నీ సజావుగా సాగితే బహుశః 2023 శాసనసభ ఎన్నికలలోగా పూర్తవవచ్చు. మద్యలో కోర్టు కేసులు పడితే ఇంకా ఆలస్యం కావచ్చు.