మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ హుజూరాబాద్ ఉపఎన్నికల బీఎస్పీ అభ్యర్ధిగా బరిలో దిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పధకం ప్రకటించిన తరువాత హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో స్థానిక సమస్యలపై చర్చ పక్కకుపోయింది. మూడు ప్రధాన పార్టీలు దళిత బంధు చుట్టూనే తిరుగుతున్నాయి. దీంతో హుజూరాబాద్ ఉపఎన్నికలో దళితుల సంక్షేమం, అభివృద్ధి ప్రధానాంశాలుగా మారాయి. ప్రవీణ్ కుమార్ దళితుల సంక్షేమం కోసమే పదవికి రాజీనామా చేసి రాజకీయాలలోకి వచ్చారు కనుక హుజూరాబాద్ ఉపఎన్నికలో బీఎస్పీ అభ్యర్ధిగా పోటీ చేసి, ఈ విషయంలో మూడు ప్రధాన పార్టీల ద్వందవైఖరిని ఎండగట్టి బీసీలు, దళితుల సమైక్య శక్తిని చాటిచెప్పాలని పార్టీ నేతలు ఆయనపై ఒత్తిడి చేస్తున్నారు. ఎల్లుండి అంటే గురువారం కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు నేతలు బీఎస్పీలో చేరుతున్నారు. ఆ సందర్భంగా ప్రవీణ్ కుమార్ తన నిర్ణయాన్ని ప్రకటించవచ్చని తెలుస్తోంది.
ఒకవేళ ఆయన కూడా బరిలో దిగితే కాంగ్రెస్, బిజెపిలకంటే టిఆర్ఎస్‌కు ఎక్కువ నష్టం జరగవచ్చు. హుజూరాబాద్ ఉపఎన్నికలో దళిత బంధు పధకాన్ని టిఆర్ఎస్ బ్రహ్మాస్త్రంగా భావిస్తోంది. దానికోసం ఇప్పటికే రూ.1,000 కోట్లు విడుదల చేసింది. త్వరలో మరో రూ.1,000 కోట్లు విడుదల చేయబోతోంది. ఇంత ఖర్చు చేసిన తరువాత నియోజకవర్గంలో బీసీలు, దళితులు ప్రవీణ్ కుమార్ వైపు మొగ్గు చూపితే టిఆర్ఎస్‌కు అది పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. సిఎం కేసీఆర్ హుజూరాబాద్ ఉపఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఈ ఉపఎన్నికలో ప్రవీణ్ కుమార్ గెలిచినా లేదా టిఆర్ఎస్ ఓట్లు చీల్చి దాని ఓటమికి కారణమైనా రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు మరో కొత్త శత్రువు తయారైనట్లే భావించవచ్చు. ఇంతకీ ప్రవీణ్ కుమార్ ఉపఎన్నికలో పోటీ చేస్తారో లేదో చూడాలి.