ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ పూర్తికాక మునుపే తాలిబన్లు దేశాన్ని వశపరుచుకోవడం ఆశ్చర్యకరమైన విషయమే. తాలిబన్లు ఒక్కో నగరాన్ని స్వాధీనం చేసుకొంటుంటే ఆఫ్ఘన్ సైనికులు వారిని ప్రతిఘటించారు కానీ అడ్డుకోలేకపోయారు. తాలిబన్లు కాబూల్ నగరాన్ని ఆక్రమించుకోవడంతో దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రజలను తాలిబన్ల దయాదాక్షిణ్యాలకు విడిచిపెట్టి హెలికాప్టర్‌లో యూఏఈ పారిపోయారు. ఈ పరిస్థితులలో సామాన్య ప్రజలు వీధులలోకి వచ్చి తాలిబన్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన బాట పట్టడం చాలా ఆశ్చర్యకరమైన పరిణామమే. అత్యాధునిక ఆయుధాలు చేతబూనిన ఆఫ్ఘన్ సైనికులే తమ ముందు తలవంచి పారిపోవడంతో తమకు ఎదురేలేదనుకొన్న తాలిబన్లకు సామాన్య ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురవుతుండటం చాలా దిగ్బ్రాంతి కలిగించే విషయమే. తాలిబన్లను ధిక్కరించడం వారి ప్రాణాలకే ప్రమాదకరమని తెలిసినా గదిలో బందించి కొడితే పిల్లి కూడా తిరగబడుతుందన్నట్లు, ప్రజలు తమ కుటుంబాలను కాపాడుకోవడం కోసమే ఈ సాహసానికి పూనుకొంటున్నారని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో మహిళలతో సహా ప్రజలు రోడ్లపైకి ఆందోళనలు చేస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం కాబూల్ నగరానికి సుమారు 150 కిమీ దూరంలో ఉన్న పంజ్‌షిర్ ప్రావిన్స్‌లో ప్రజలు యువనాయకుడు అహ్మద్ మసూద్ నేతృత్వంలో తాలిబన్లను తిప్పికొట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల తాలిబన్లతో జరిగిన యుద్ధంలో సుమారు 300 మందిని వారు మట్టుబెట్టినట్లు సమాచారం. దేశాన్ని తాలిబన్ల చెర నుంచి విముక్తి కల్పించి మళ్ళీ ప్రజాస్వామ్య వ్యవస్థను నెలకొల్పడమే తమ లక్ష్యమని అహ్మద్ మసూద్ ప్రకటించినట్లు తెలుస్తోంది. కనుక ఇప్పుడు అతనే ఆఫ్ఘన్లకు ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు. కానీ విదేశాల సహాయసహకారాలు లేకుండా తానొక్కడే తాలిబన్లను అంతమొందించలేనని కనుక అగ్రరాజ్యాలు తమకు సాయపడలాని విజ్ఞప్తి చేస్తున్నారు.