మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి: సోనియా గాంధీ

August 21, 2021


img

వచ్చే లోక్‌సభ ఎన్నికలలో బిజెపిని గద్దె దించాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ బిజెపిని వ్యతిరేకిస్తున్న 19 ప్రతిపక్ష పార్టీల అధినేతలతో శుక్రవారం వర్చువల్ విధానంలో సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా ఆమె వారితో మాట్లాడుతూ,” ప్రస్తుత పరిస్థితులలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అందరం కలిసి పనిచేయడం తప్ప మరో మార్గం లేదు. ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాలలో మనం (ప్రతిపక్షాలు) చాలా సమైక్యంగా వ్యవహరించి సమస్యలపై మోడీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశాము. ఇదేవిదంగా ఐఖ్యంగా ఉంటూ బిజెపిపై పోరాడవలసి ఉంది. స్వాతంత్ర్య పోరాట విలువలు, ప్రజల ఆకాంక్షలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలను కాపాడాటమే ధ్యేయంగా అందరం కలికట్టుగా పనిచేయాలి. 2024 లోక్‌సభ ఎన్నికలలో బిజెపిని ఓడించి విపక్ష కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తేనే దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలుతాము,” అని అన్నారు.             

కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ (కూటమి)లోనే చాలా పార్టీలున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ పూనుకొంటే దాని నేతృత్వంలో బిజెపిని ఎదుర్కొనేందుకు మరికొన్ని పార్టీలు ముందుకు రావచ్చు. అయితే టిఆర్ఎస్‌ వంటి కొన్ని పార్టీలు కాంగ్రెస్‌ పార్టీని కూడా వ్యతిరేకిస్తున్నాయి. కనుక అవి ఈ ప్రతిపక్ష కూటమిలో చేరకపోవచ్చు. 

ఇదివరకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బిజెపియేతర పార్టీలను ముప్పతిప్పలు పెట్టింది. చివరికి తమ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన సమాజ్‌వాదీ, బీఎస్పీలను కూడా విడిచిపెట్టలేదు. కానీ ఇప్పుడు అవే పార్టీలతో కలిసికట్టుగా పోరాడేందుకు సిద్దమంటోంది. ఎందుకంటే అదిప్పుడు ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయి తనంతట తానుగా ఎప్పటికీ కేంద్రంలో అధికారంలోకి రాలేదని గ్రహించినందునే! కేంద్రంలో పదవులు, అధికారం కోసం ఒకవేళ అన్నీ చేతులు కలిపినా బలమైన నాయకత్వం, ప్రధాని అభ్యర్ధిపై ఏకాభిప్రాయం లేకపోతే వాటి సఖ్యత ఎంతో కాలం నిలువదు. ఈవిషయం గతంలో పలుమార్లు నిరూపితమైంది.


Related Post