భారత్‌లో 12 ఏళ్ళు పైబడిన పిల్లలకు కోవిడ్ వాక్సిన్ సిద్దం అయ్యింది. దీని అత్యవసర వినియోగానికి డీసీజీఐ శుక్రవారం అనుమతించింది. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జైడస్ క్యాడిలా కంపెనీ జైకొవ్-డ్ అనే వ్యాక్సిన్‌ను తయారుచేసింది.
జైకోవ్-డిలో చాలా ప్రత్యేకతలు:
• ప్రస్తుతం వినియోగిస్తున్న కోవీషీల్డ్, కోవాక్సిన్‌లు రెండు డోసులు తీసుకోవలసి ఉండగా ఇది మూడు డోసులు తీసుకోవలసి ఉంటుంది. మొదటి డోస్ తీసుకొన్న 28 రోజులకు రెండవది, మరో 28 రోజుల తరువాత మూడవ డోస్‌కు తీసుకోవలసి ఉంటుంది. మూడు డోసులు తీసుకోవడం వలన మరింత ఎక్కువ కాలం కోవిడ్ వైరస్ నుంచి రక్షణ లభిస్తుంది.
• దీనిలో మరో ప్రత్యేకత ఏమిటంటే దీనిని సిరేంజి ద్వారా కండరంలోకి ఇంజెక్షన్ చేయరు. దీనికోసం ప్రత్యేకంగా తయారుచేసిన ‘ఫార్మాజెట్’ అనే సిరేంజి వంటి పరికరంతో చర్మం కింద ఇస్తారు. కనుక పెద్దగా నొప్పి ఉండదు.
• అలాగే ప్రపంచంలోనే ఇది తొలి డీఎన్ఏ ప్లాస్మిడ్ విధానంలో తయారుచేశారు. దీనిని తీసుకొన్నప్పుడు కోవిడ్ వైరస్ కొమ్ము(స్పైక్స్)లను పోలినట్లుండే ప్రోటీన్ స్పైక్స్ శరీరంలోకి విడుదలవుతాయి. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ వాటిని వైరస్‌గా భావించి వెంటనే యాంటీబాడీలను విడుదల చేస్తుంది. అవి శరీరంలో అలా ఉండిపోతాయి కనుక కోవిడ్ వైరస్ శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకొంటాయి.
• డీఎన్ఏ ప్లాస్మిడ్ విధానంలో తయారుచేయడం వలన మరో గొప్ప ప్రయోజనం ఏమిటంటే, మున్ముందు కోవిడ్ కొత్త కొత్త వేరియెంట్లు ఎన్ని పుట్టుకువచ్చినా వాటికి తగ్గట్లు ఈ వ్యాక్సిన్‌లో వెంటవెంటనే మార్పులు చేసి వినియోగించుకోవచ్చు.
మిషన్ కోవిడ్ సురక్షా కార్యక్రమంలో భాగంగా ఐసీఎంఆర్ మరియు కేంద్ర బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ)ల సహకారంతో ఈ జైకొవ్-డి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. దీని మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో 28 వేలమందిపై పరీక్షించగా అద్భుతమైన ఫలితాలు వచ్చాయని డీబీటీ ప్రకటించింది. కనుక దీని అత్యవసర వినియోగానికి డీసీజీఐ శుక్రవారం అనుమతించింది. మరో రెండు నెలల్లో భారత్‌లో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, ఏడాదికి 24 కోట్ల డోసులు ఉత్పత్తి చేయబోతున్నట్లు ఆ సంస్థ ఎండీ షర్విల్ పటేల్ తెలిపారు.