వైఎస్ షర్మిల అధ్యక్షురాలిగా ఏర్పాటు చేసిన వైఎస్సార్‌టిపికి ఈరోజు పెద్ద షాక్ తగిలింది. వైఎస్ షర్మిల పార్టీ పెడుతున్నట్లు ప్రకటించగానే మొట్టమొదట వచ్చి చేరిన ఇందిరా శోభన్ ఈరోజు పార్టీకి రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖను వైఎస్ షర్మిలకు పంపించారు. మహిళలు, బడుగుబలహీనవర్గాల హక్కుల కోసం పోరాడాలనుకొంటున్నట్లు ఆమె చెప్పిన్నప్పటికీ రాజీనామా చేయడానికి అసలు కారణం ఇంకా తెలియవలసి ఉంది. బహుశః రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చురుకుగా మారడంతో ఆమె తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకోవాలనుకొంటున్నారేమో? వైఎస్సార్‌టిపిలో చేరి ఆరేడు నెలలు కూడా కాకపోయినా ఆమె పార్టీ వ్యవహారాలలో చాలా చురుకుగా పనిచేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకొన్నారు. వైఎస్ షర్మిల దీక్షలు, ధర్నాలతో తెలంగాణలో వైఎస్సార్‌టిపిని బలపరుచుకోవాలని ప్రయత్నిస్తుంటే, మరోవైపు ఇందిరా శోభన్ వంటి సీనియర్ నేత రాజీనామా చేయడం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు.