గత రెండు దశాబ్ధాలలో ఆఫ్ఘనిస్తాన్‌లో చెదురుముదురు దాడులు జరిగినప్పటికీ, ప్రజలు ముఖ్యంగా...మహిళలు చాలా స్వేచ్ఛగా జీవించారు. దేశాభివృద్ధి కూడా జరిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు దేశం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ ప్రజల, దేశ భవిష్యత్ అయోమయంగా మారింది.
ఇంతకాలం అమెరికా దళాలతో పోరాడేందుకు తాలిబన్లు ఐక్యంగా కలిసి పనిచేశారు. కానీ ఇప్పుడు అధికారం చేపట్టాక వారిలో ఆ సఖ్యత కొనసాగకపోవచ్చు. అధికారం కోసం వారి మద్య పోరు మొదలైతే పైచేయి సాధించడానికి వారు విధ్వంసం సృష్టించవచ్చు లేదా ప్రజలపై తమ ప్రతాపం చూపించవచ్చు.
మరోపక్క ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచిపారిపోవడంతో ఉపాధ్యక్షుడు అమరుల్లాహ్ సలేహ్ తానే దేశాధ్యక్షుడినని ప్రకటించుకొని, తన మద్దతుదారులు, మిగిలిన ఆఫ్ఘన్ సేనలతో కలిసి తాలిబన్లను ఎదుర్కొనేందుకు సిద్దం అవుతున్నారు. దీంతో ఇరువర్గాల మద్య త్వరలోనే అంతర్యుద్ధం ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే అనేకచోట్ల ఆఫ్ఘన్ ప్రజలు తాలిబన్ల వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. వారిని ఉక్కుపాదంతో అణచివేసేందుకు తాలిబన్లు ఏమాత్రం సంకోచించరని అందరికీ తెలుసు. కనుక దేశంలో మరో మారణహోమం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
తాలిబన్లకు చేతికి డబ్బు అందకుండా ఉండేందుకు అమెరికాలోని వారి బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసింది. అగ్రదేశాలు ఆఫ్ఘనిస్తాన్‌పై ఆర్ధిక, వాణిజ్యపరమైన ఆంక్షలు విధించే ఆలోచనలు చేస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆఫ్ఘనిస్తాన్ ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. తాలిబన్ల భయంతో దేశంలో మార్కెట్లు, దుకాణాలు మూతపడ్డాయి. ఇవన్నీ ఆర్ధిక సంక్షోభానికి దారితీస్తాయి కనుక ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి మరింత దయనీయంగా మారవచ్చు.
తాలిబన్ల భయంతో ప్రభుత్వాధికారులు, ఉద్యోగులు విధులకు హాజరు కావడం లేదు. దీంతో పరిపాలన కుంటుపడి వ్యవస్థలన్నీ ఒకటొకటిగా కుప్ప కూలే ప్రమాదం పొంచి ఉంది.
ఈవిదంగా ఎటు చూసిన ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అయినా ఐక్యరాజ్య సమితి, ప్రపంచదేశాలు వేచిచూస్తున్నాయి తప్ప ఇప్పటికిప్పుడు ఆఫ్ఘన్ సమస్యలో వేలు పెట్టేందుకు సాహసించడం లేదు. కనుక ఆఫ్ఘనిస్తాన్ దేశ భవిష్యత్, ప్రజల భవిష్యత్ ఆగమ్యగోచరంగా ఉంది. ఈ సమస్యలు ఎప్పటికీ ఏవిదంగా తీరుతాయో... అసలు ఎప్పటికైనా తీరుతాయో లేదో కూడా తెలీదు. కనుక ఆఫ్ఘనిస్తాన్‌ను... ప్రజలను ఆ దేవుడే కాపాడాలి.