హుజూరాబాద్ ఉపఎన్నిక... దానిపై జరిగే రాజకీయాలు ఆ ఒక్క నియోజకవర్గానికే పరిమితం కావాల్సి ఉండగా అధికార, ప్రతిపక్షాల విమర్శలు, ప్రతివిమర్శలతో యావత్ రాష్ట్రంలో భగభగ మంటలు పుట్టిస్తున్నాయి. కానీ ఈ ఉపఎన్నిక సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గం అభివృద్ధి, తదితర అంశాల కంటే ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన దళిత బంధు పధకంపైనే ఎక్కువగా చర్చలు, వాదోపవాదాలు జరుగుతుండటం విశేషం. అయితే ప్రతిపక్షాలు కూడా దాని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాయి కనుక ఈవిషయంలోటిఆర్ఎస్ వ్యూహం కొంతమేర ఫలించినట్లే భావించవచ్చు.
అయితే ఉపఎన్నికలో ఓటమి భయంతోనే సిఎం కేసీఆర్ హడావుడిగా దళిత బంధు పధకం ప్రకటించి, హుజూరాబాద్‌లో సభ నిర్వహించారని కాంగ్రెస్, బిజెపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓవైపు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో దండోరా సభలు నిర్వహిస్తూ సిఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పిస్తుంటే మరోవైపు ఈటల రాజేందర్, బండి సంజయ్ కలిసి సిఎం కేసీఆర్ లక్ష్యంగా మాటల తూటాలు పేలుస్తుండటంతో టిఆర్ఎస్ నేతలు కూడా సిఎం కేసీఆర్ నిర్ణయాన్ని, దళిత బంధు పధకాన్ని సమర్ధించుకొంటూ వారిపై ఎదురుదాడి చేస్తున్నారు. దీంతో హుజూరాబాద్ ఉపఎన్నిక కంటే దళిత బంధు పధకంపై రాష్ట్రవ్యాప్తంగా వాడివేడిగా చర్చలు సాగుతున్నాయి.