హైదరాబాద్ నుంచి కర్నాటకలో బీజాపూర్ వరకు 60 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసలు కలిగిన జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కేంద్రప్రభుత్వం దీనిని భారత్ మాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేర్చి, జాతీయ రహదారి నెంబర్ 163గా గుర్తించి, నేషనల్ హైవే ఆధారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్ఏఐ)కు అప్పగించింది. ఎక్కడికక్కడ అండర్ పాస్‌లతో సహా నిర్మాణ పనులను 18-24 నెలల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది.
హైదరాబాద్ శివారులోని అప్పా జంక్షన్ నుంచి మొదలై వికారాబాద్ దారిలోని మన్నెగూడ, పరిగి, బీదర్ మీదుగా బీజాపూర్ వరకు దీనిని నిర్మిస్తుంది. దీనిలో భాగంగా మొయినాబాద్ వద్ద 4.35కిమీ పొడవుతో, చేవెళ్ళ వద్ద 6.36 కిమీ పొడవుతో రెండు బైపాస్ రోడ్లను కూడా నిర్మిస్తారు. ఈ జాతీయ రహదారిలో మొత్తం 8 చోట్ల అండర్ పాస్‌లు నిర్మించనున్నారు. మన్నెగూడ సమీపంలో చిట్టంపల్లి వద్ద 12 లేన్లతో టోల్‌ప్లాజా ఏర్పాటు చేస్తారు.
అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46.40 కిమీ మార్గంలో 25-30 మీటర్ల వెడల్పుతో ఉన్న రోడ్లను 60 మీటర్లకు విస్తరిస్తారు. దీని కోసం త్వరలోనే (221.90 హెక్టార్లు) భూసేకరణ ప్రక్రియ ప్రారంభిస్తారు. రెండు నెలల్లోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి రెండేళ్ళలోగా హైదరాబాద్ నుచి బీజాపూర్ వరకు జాతీయ రహదారి నిర్మాణ పనులు పూర్తిచేస్తామని ఎన్‌హెచ్ఏఐ ప్రతినిధి తెలిపారు.