ఆఫ్ఘన్‌లో హృదయవిదారక దృశ్యాలు

August 19, 2021


img

ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకొన్న తరువాత మొదటి రెండు మూడు రోజులు శాంతి ప్రవచనాలు పలికిన తాలిబన్లు, మళ్ళీ ప్రజలపై కాల్పులు జరిపి, పార్కులు, విగ్రహాలు ధ్వంసం చేసి తమ అసలు రూపం బయటపెట్టుకొన్నారు. అయితే వారి శాంతి ప్రవచనాలను, హామీలను ప్రజలు కూడా నమ్మడం లేదు. అందుకే ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని పారిపోతున్నారు. 

కానీ ఎవరూ దేశం విడిచి పారిపోకుండా ఎక్కడికక్కడ తాలిబన్లు తుపాకులు పట్టుకొని కాపలాకాస్తుండటంతో చాలా మంది ఇళ్ళలో నుంచి బయటకు రావడం లేదు. కాబూల్ నగరంలో నివసించేవారు ఎలాగో కష్టపడి విమానాశ్రయానికి చేరుకొన్నా అక్కడ తాలిబన్లు ముళ్ళకంచెలు వేసి వారిని అడ్డుకొంటున్నారు. సోమవారం వేలాదిమంది కాబూల్ విమానాశ్రయం చేరుకోవడంతో వారిని అడ్డుకొనేందుకు తాలిబన్లు వారిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఆ కాల్పులు, తొక్కిసలాటలో సుమారు 40 మంది ప్రజలు చనిపోయినట్లు సమాచారం.

అతికష్టం మీద విమానాశ్రయం కంచె వద్దకు చేరుకొన్న ప్రజలు లోపల గస్తీ కాస్తున్న సైనికులను తమను లోపలకు రానిచ్చి విమానాలలో తీసుకుపోవాలని ప్రార్ధిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు...తమను తాలిబన్ల చేతికి చిక్కకుండా కాపాడాలంటూ కన్నీళ్ళతో వేడుకొంటున్నారు. కొంతమంది ఆఫ్ఘన్లు కనీసం తమ పిల్లలనైనా కాపాడుకోవాలని ముళ్ళ కంచెల పైనుంచి పిల్లలను లోపలకి విసిరేస్తున్నారని, వారినైనా విమానాలలో ఏదో ఓ దేశానికి తరలించాలని కన్నీళ్ళతో వేడుకొంటున్నారని ఓ బ్రిటిష్ అధికారి చెప్పారు. ఇటువంటి దయనీయ పరిస్థితులను చూస్తుంటే తమ హృదయం బాధతో విలవిలలాడుతోందని చెప్పారు.


Related Post