దళిత బంధు పధకం గురించి అధికార, ప్రతిపక్షాలు పూర్తి భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై దళితులతో సహా రాష్ట్రంలో ఇతర కులమతాలకు చెందిన ప్రజలు ఏమనుకొంటున్నారు?వారు ఈ పధకాన్ని సమర్ధిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా?అంటే దీనిపై ప్రజలలో కూడా భిన్నాభిప్రాయాలున్నాయని చెప్పవచ్చు. అధికార, ప్రతిపక్షాలు నిర్వహిస్తున్న సభలకు భారీ ఎత్తున జనం హాజరవడమే ఇందుకు నిదర్శనంగా భావించాల్సి ఉంటుంది. హుజూరాబాద్‌లో ఈ పధకాన్ని ప్రారంభించేందుకు సిఎం కేసీఆర్ నిర్వహించిన సభకు లక్షకు పైగా జనం హాజరయ్యారు. అలాగే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ సభలకు భారీగా జనం హాజరవుతున్నారు.
అధికార, ప్రతిపక్షాల శక్తి సామర్ధ్యాల బట్టి జనసమీకరణ చేసి సభలు విజయవంతం చేసుకొంటున్నారనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అయితే తమ సభలు విజయవంతం అవుతుండటమే ప్రామాణికమని ఆయా పార్టీలు భావిస్తున్నాయి కనుక ఆ లెక్కన రాష్ట్రంలో దళిత బంధు పధకాన్ని సమర్ధించేవారు, వ్యతిరేకించేవారు కూడా ఉన్నారని స్పష్టం అవుతోంది.
త్వరలోనే హుజూరాబాద్ ఉపఎన్నిక జరుగనుంది. దానిలో గెలుపొందేందుకు అధికార ప్రతిపక్షాలు అనేక వ్యూహాలు, ప్రలోభాలతో విశ్వప్రయత్నాలు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక ఎన్నికల ఫలితాలను అవే నిర్దేశిస్తున్నప్పటికీ, ఉపఎన్నికలో గెలుపే ప్రామాణికమని అధికార ప్రతిపక్షాలు భావిస్తున్నాయి కనుక ఉపఎన్నికలో టిఆర్ఎస్ గెలిస్తే ప్రజలు దళిత బంధు పధకానికి మద్దతు ఇస్తున్నట్లు లేకుంటే లేనట్లు భావించాల్సి ఉంటుంది.
సభలకు వచ్చే జనాలు, ఎన్నికల ఫలితాలు ప్రజాభిప్రాయానికి అద్దం పట్టడం లేదు గనుక దళిత బంధు పధకంపై ప్రజాభిప్రాయం తెలుసుకోవాలంటే రాష్ట్ర రాజకీయాలకు అతీతంగా పనిచేసే సంస్థ నిజాయితీగా, పారదర్శకంగా సర్వే చేయాల్సి ఉంటుంది. లేకుంటే ఎవరి గొంతు బిగ్గరగా వినిపిస్తే వారు చెప్పేదే నిజమని సర్దుకుపోక తప్పదు.