రేవంత్‌ బ్రోకర్, బండి జోకర్, అరవింద్ లోఫర్: టిఆర్ఎస్‌

August 18, 2021


img

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పధకంపై కాంగ్రెస్‌, బిజెపి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, బండి సంజయ్‌ చేస్తున్న విమర్శలపై టిఆర్ఎస్‌ ఘాటుగా స్పందించింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ ఏ జీవన్ రెడ్డి నిన్న టిఆర్ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ కౌటిల్యుడివంటివారు. ఆయనకు రాష్ట్ర ఆర్ధికస్థితి గురించి పూర్తి అవగాహన ఉంది. దానిని దృష్టిలో పెట్టుకొనే సంక్షేమ పధకాలను రూపొందిస్తుంటారు. దళిత బంధు పధకాన్ని కూడా అలాగే రూపొందించారు. రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలకు ఈ పధకం ద్వారా 1.70 లక్షల కోట్లు ఇస్తామని సిఎం కేసీఆర్‌ ప్రకటించారు. అయినా కాంగ్రెస్‌, బిజెపి నేతలు సిఎం కేసీఆర్‌పై అనవసరంగా విమర్శలు చేస్తున్నారు. దళిత బంధు పధకంతో పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చిన్న మెదడు పాడైనట్లుంది. అందుకే నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. రేవంత్‌ రెడ్డి ఓ బ్రోకర్, బండి సంజయ్‌ ఓ జోకర్, నిజామాబాద్‌ ఎంపీ అరవింద్ ఓ లోఫర్. ఇటువంటివారే సిఎం కేసీఆర్‌ను విమర్శిస్తుంటారు. దళిత బంధు పధకంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌, బిజెపి కార్యాలయాలను త్వరలోనే మూసుకొని టులెట్ బోర్డులు తగిలించుకొనే రోజు ఎంతో దూరం లేదు. ఆ భయంతోనే రేవంత్‌ రెడ్డి, బండి సంజయ్‌ ఇద్దరూ సిఎం కేసీఆర్‌ గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు,” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసమే దళిత బంధు పధకం ప్రవేశపెట్టామని టిఆర్ఎస్‌ గట్టిగా వాదిస్తోంది. కానీ ఆ పధకం దెబ్బకి రాష్ట్రంలో కాంగ్రెస్‌, బిజెపి కార్యాలయాలు మూతపడతాయని జీవన్ రెడ్డి చెప్పడం చూస్తే దాంతో రాష్ట్రంలోని ప్రతిపక్షాలను రాజకీయంగా దెబ్బతీయాలనే ఆలోచన కూడా ఉందని స్పష్టం అవుతోంది. టిఆర్ఎస్‌ తమను రాజకీయంగా దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నప్పుడు కాంగ్రెస్‌, బిజెపిలు చేతులు ముడుచుకొని కూర్చోవు కనుక అవి కూడా దళిత బంధు పధకంతోనే టిఆర్ఎస్‌ను ఎదుర్కొంటున్నాయి. అందుకు టిఆర్ఎస్‌ వాటిపై ఈవిదంగా నిప్పులు కక్కడం అభద్రతాభావానికి గురవుతున్నట్లు భావించవలాసీ ఉంటుంది. టిఆర్ఎస్‌ ఈ పధకాన్ని రాష్ట్ర రాజకీయాలలో గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్నప్పుడు ప్రతిపక్షాల విమర్శలకు ఇంతగా ఆందోళన చెందవలసిన అవసరం ఏమిటి?


Related Post