తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు పధకం రాష్ట్ర రాజకీయాలలో కొత్త ఊపు తీసుకువచ్చింది. దీంతో కాంగ్రెస్, బిజెపిలను ఆత్మరక్షణలో పడేశామని టిఆర్ఎస్ భావిస్తుంటే, దీనితోనే టిఆర్ఎస్ పార్టీని, ప్రభుత్వాన్ని కూడా ఆత్మరక్షణలో పడేయాలని కాంగ్రెస్, బిజెపిలు ప్రయత్నిస్తుండటం విశేషం.
దళిత బంధు పధకంతో రాష్ట్రంలో దళితులందరూ టిఆర్ఎస్‌వైపు మొగ్గుచూపుతారు. ఈ పధకంతో రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్‌కు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. కనుక కాంగ్రెస్, బిజెపిలు నిసహాయ పరిస్థితికి చేరుకొంటాయని టిఆర్ఎస్ భావిస్తోంది.
అయితే దళిత బంధుతో పాటు రాష్ట్రంలోని 10 లక్షల గిరిజన, ఆదివాసీల కోసం ‘గిరిజన బంధు’, 60 లక్షల మంది బీసీల కోసం ‘బీసీ బంధు’ పధకాలను కూడా ప్రవేశపెట్టి వారికి కూడా ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు చొప్పున ప్రభుత్వం ఇవ్వాలని బిజెపి డిమాండ్ చేస్తోంది.
ఈ పధకాలతోపాటు 2018 శాసనసభ ఎన్నికలలో ఇచ్చిన హామీలు...నిరుద్యోగ భృతి, రైతుల పంట రుణాల మాఫీ, దళితులకు 3 ఎకరాల భూమి, ప్రతీ కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు తక్షణం ఇవ్వాలని బిజెపి డిమాండ్ చేస్తోంది. డిమాండ్ చేయడమే కాకుండా బిజెపి అధ్వర్యంలో ఈ సంక్షేమ పధకాల కోసం అర్హులైనవారి నుంచి దరఖాస్తులు కూడా స్వీకరిస్తోంది. దీని కోసం బండి సంజయ్ కరీంనగర్‌లో ‘దరఖాస్తుల ఉద్యమం’ ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అనేక సంక్షేమ పధకాలు అర్హులైనవారికి దక్కేలా చేసేందుకు ఈ ఉద్యమంతో ప్రభుత్వంపై ఒత్తిడి చేయడమే తప్ప దీనిలో ఎటువంటి రాజకీయ ఉద్దేశ్యాలు లేవని బండి సంజయ్ అన్నారు. ఈనెల 24 నుండి తాను చేయబోయే ప్రజా సంగ్రామ పాదయాత్రలో దారిపొడవునా అర్హులైనవారి నుంచి దరఖాస్తులు సేకరించి ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు.