దళిత బంధు పధకం గురించి సిఎం కేసీఆర్‌తో టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ చాలా గొప్పగా చెప్పుకొంటున్నారు. ప్రభుత్వం ఏ పధకం ప్రవేశపెట్టినా దాని గురించి వారు ఇలాగే గొప్పగా చెప్పుకొని దాంతో రాజకీయ లబ్ది పొందుతుండటం టిఆర్ఎస్‌కు అలవాటే. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.
‘అర్హులందరికీ ఇళ్ళు ఇవ్వాలంటే సాధ్యం కాదని వారి అదృష్టం బాగుంటే 5-10 సం.లలో ఏదో ఓ రోజు వారికి ఇల్లు లభిస్తుందని అంతవరకు ఓపిక పట్టాల్సిందేనని’ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గతంలో అన్నారు. రాబోయే రోజుల్లో దళిత బంధు గురించి కూడా టిఆర్ఎస్ ఇలాగే చెప్పినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో 17 లక్షల ఎస్సీ కుటుంబాలున్నాయని నిన్న హుజూరాబాద్ సభలో సిఎం కేసీఆర్ స్వయంగా చెప్పారు. వారందరికీ ఈ పధకాన్ని వర్తింపజేయాలంటే ప్రభుత్వం వద్ద లక్షల కోట్లు ఉండాలి. ఏ ప్రభుత్వమూ అంత సొమ్ము ఓ నాలుగైదేళ్ళలో కూడా కేటాయించలేదు.
ఉదాహరణకు రెండున్నరేళ్ళు గడిచినా ఇంతవరకు ప్రభుత్వం లక్ష రూపాయల పంట రుణాల మాఫీ చేయలేకపోయింది. లక్ష రూపాయలే చెల్లించలేకపోతున్న ప్రభుత్వం ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున రాష్ట్రంలోని 17 లక్షల కుటుంబాలకు ఎప్పటికీ ఇస్తుంది? అని ఆలోచిస్తే పరిస్థితి అర్ధమవుతుంది. కనుక రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలకు ఈ పధకం చేరాలంటే బహుశః దశాబ్ధాలు పట్టవచ్చు.
సామాన్యులకు సైతం తెలిసిన ఈవిషయం టిఆర్ఎస్‌కు తెలియదనుకోలేము. బహుశః అందుకే సిఎం కేసీఆర్ ఈ పధకాన్ని దశలవారీగా అమలుచేస్తామని ముందే చెప్పారనుకోవచ్చు. ఆ దశలు ఎప్పుడు పూర్తవుతాయో రాష్ట్రంలో 17 లక్షల కుటుంబాలకు ఎప్పుడు ఈ పధకం అందుతుందో బహుశః టిఆర్ఎస్‌లో కూడా ఎవరికీ తెలిసి ఉండదు.
ఒకవేళ రాష్ట్రంలో 17 లక్షల కుటుంబాలకు నిజంగానే దశలవారీగా అంటే మరో 20-30 ఏళ్లలో ఈ పధకాన్ని వర్తింపజేసినా అప్పటికి వారి సంఖ్య మరో 5-7 లక్షలు పెరుగుతుందే తప్ప తరగదు. వారికీ ఈ పధకాన్ని వర్తింపజేయాలంటే దీనిని నిరంతరంగా ఎప్పటికీ కొనసాగించాల్సి ఉంటుంది. కనుక దీనిని పూర్తిగా అమలుచేయలేకపోయినా హుజూరాబాద్ ఉపఎన్నిక మొదలు వచ్చే శాసనసభ ఎన్నికల వరకు ఈ పధకం గురించి టిఆర్ఎస్ గొప్పగా చెప్పుకొంటూ రాజకీయలబ్ది పొందాలని ప్రయత్నించడం మాత్రం తధ్యం.
ఈ పధకంతో దేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా అగ్గి రాజుకొంటుందని సిఎం కేసీఆర్ చెప్పిన మాట నూటికి నూరు శాతం వాస్తవమే. అయితే అంతకంటే ముందు తెలంగాణలో రాజుకొంటున్న ఈ అగ్గిని ఏవిదంగా ఆర్పుతారో చూడాలి. ఎందుకంటే, దళిత బంధు పధకం కోసం ఇప్పటికే అన్ని జిల్లాలలో దళిత కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. వారిలో కొందరికి మాత్రమే ఇది లభిస్తుంది. అప్పుడు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు దక్కనివారు ఆక్రోశిస్తున్నట్లే ఈ పధకం దక్కనివారు కూడా ఆక్రోశిస్తారు.
సిఎం కేసీఆర్ దళిత బంధు పధకం పేరుతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు రాల్చుకోవాలని చూస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం ఎలాగూ రాష్ట్రంలో 17 లక్షల మందికి ఈ పధకాన్ని ఇవ్వలేదు కనుక ప్రతిపక్షాల వాదనలకు బలం చేకూరుతుంది. దళితుల ఆగ్రహావేశాలను ప్రతిపక్షాలు అనుకూలంగా మార్చుకొనే ప్రయత్నం చేయకమానవు. వాటి ప్రయత్నాలు ఫలిస్తే టిఆర్ఎస్ పార్టీయే నష్టపోతుంది.
దళిత బంధులాగే తమకు పధకాలు ప్రకటించాలని పలు కులసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్షాలు వారికి మద్దతు ఇవ్వడం ద్వారా టిఆర్ఎస్ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు గట్టిగా ప్రయత్నించవచ్చు.
కనుక దళిత బంధుతో టిఆర్ఎస్ తాత్కాలిక ప్రయోజనం (హుజూరాబాద్ ఉపఎన్నికలో విజయం) పొందగలదేమో కానీ దీర్గకాలంలో నష్టపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దళిత బంధు పధకం గేమ్ ఛేంజర్ అని టిఆర్ఎస్ భావిస్తోంది. అది నిజమే. అయితే ఈ గేమ్ టిఆర్ఎస్‌కు అనుకూలంగా ఛేంజ్ అవుతుందా లేక ప్రతిపక్షాలకు అనుకూలంగా మారుతుందో కాలమే చెపుతుంది.