మీసాలకు సంపెంగ నూనె అన్నట్లు టీఎస్‌ఆర్టీసీ పరిస్థితి

August 15, 2021


img

మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అన్నట్లుంది టీఎస్‌ఆర్టీసీ పరిస్థితి ఇప్పుడు. ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి డబ్బు లేకపోవడంతో బ్యాంకుల నుంచి అప్పు తీసుకొంది. ప్రభుత్వం రూ.1,000 కోట్లకు హామీ ఇచ్చినప్పటికీ బ్యాంకులు టీఎస్‌ఆర్టీసీ పరిస్థితి చూసి రూ.500 కోట్లే ఇచ్చాయి. కనుక ప్రభుత్వం ఇచ్చినా ఆ హామీ పత్రం పట్టుకొని వేరే ఎక్కడైనా మరో రూ. 500 కోట్లు అప్పు దొరుకుతుందేమోనని టీఎస్‌ఆర్టీసీ అధికారులు తిరుగుతున్నారు. హైదరాబాద్‌లో నడుస్తున్న సర్వీసులనే నిలిపివేసి, కొన్ని బస్సులను మూలపడేసి, కొన్నిటిని కార్గో వాహనాలుగా మార్చి నడిపిస్తూ ఆదాయం సమకూర్చుకోవడానికి ముప్పతిప్పలు పడుతోంది. ఈ పరిస్థితులలో హైదరాబాద్‌ నగరానికి కొత్త ఆకర్షణ జోడించేందుకు డబుల్ డెక్కర్ బస్సుల కొనుగోలు చేయాలనే ప్రతిపాదనలు టీఎస్‌ఆర్టీసీకి మీసాలకు సంపెంగ నూనె రాసుకొంటున్నట్లే అవుతోంది. 

బేరసారాల తరువాత ఒక్కో డబుల్ డెక్కర్ బస్సు ఖరీదు రూ.68 లక్షలుగా తేలింది. కనీసం 25 బస్సులను కొనుగోలు చేసి తిప్పితే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. కానీ ఉద్యోగులకు జీతాల చెల్లింపుకే నెలనెలా తడుముకొంటున్నప్పుడు ఇంత డబ్బు ఎక్కడి నుంచి తేగలదు. ఒకవేళ ఏ బ్యాంక్ అయినా ప్రభుత్వం ఇచ్చిన హామీ పత్రాన్ని చూసి రూ.500 కోట్లు అప్పు ఇచ్చేమాటయితే దానిలో కొంత ఖర్చు చేసి డబుల్ డెక్కర్ బస్సులు కొనుగోలు చేయవచ్చునని టీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కానీ ఆ బస్సులపై వచ్చే ఆదాయం కంటే వాటి డీజిల్, నిర్వహణ ఖర్చులే ఎక్కువగా ఉంటుంది. కనుక బస్సులు కొన్నా అప్పు తీర్చడం కష్టమే. ఈ విషయం అప్పు ఇచ్చే బ్యాంకులకు తెలియదనుకోలేము. కనుక డబుల్ డెక్కర్ బస్సుల ప్రతిపాదన చేసిన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆరే, తన శాఖకు చెందిన నిధులతో కొనుగోలు చేయాలని అధికారులు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. వాటితో ఆదాయం రాదని తెలిసి ఉన్నప్పుడు ముచ్చట కోసం అంత ఖర్చు చేయడం ఎందుకు? చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఎందుకు? అని టీఎస్‌ఆర్టీసీ కార్మికులే ప్రశ్నిస్తున్నారు. ముందు నెలనెలా సమయానికి తమ జీతాలు ఇచ్చే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


Related Post