సిఎం కేసీఆర్ దళిత బంధు పధకాన్ని ప్రకటించి, వెంటనే వాసాలమర్రి గ్రామంలో 76 దళిత కుటుంబాల బ్యాంకు ఖాతాలలో రూ.7.6 కోట్లు విడుదల చేయడంతో ఆ పధకానికి అనూహ్యమైన స్పందన వస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది దళితులు ఆ పధకం కోసం దరఖాస్తులు పట్టుకొని అధికారుల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. అయితే సిఎం కేసీఆర్ ఈ నెల 16న హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ పధకాన్ని లాంఛనంగా ప్రారంభించిన తరువాత దశలవారీగా ఒక్కో నియోజకవర్గంలో 100 మంది చొప్పున ఎంపిక చేసి అమలుచేయాలని నిర్ణయించడంతో ఈ పధకం కోసం ఆశగా వస్తున్నవారిలో కొంతమందిని మాత్రమే ఎంపిక చేయడం అధికారులకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఒక్కసారిగా అంతమంది వస్తుండటంతో అధికారులు వారికి నచ్చజెప్పలేక వారి ఆగ్రహావేశాలకు గురవుతున్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఈ పధకం పైలట్ ప్రాజెక్టు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినందున, కందుగుల, వీణవంక, జమ్మికుంట, కుర్రపల్లి తదితర ప్రాంతాలకు చెందిన దళితులు తహశీల్దార్ కార్యాలయాల ఎదుట బైటాయించి తమను లబ్దిదారుల జాబితాలో చేర్చాలంటూ ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం కందుగుల గ్రామానికి చెందిన దళిత మహిళలు అర్హుల జాబితాతో వచ్చిన అధికారిపై దాడి చేసి అతని చేతిలో కాగితాలు చించివేశారు. నిరుపేదలైన తమకు ఆ పధకానికి ఎంపిక చేయకుండా, టిఆర్ఎస్ నేతలు సిఫార్సులు చేసినవారిని ఎంపిక చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక ఈ పధకాన్ని తమ ప్రాంతంలో కూడా వెంటనే అమలుచేయాలని కోరుతూ పలు చోట్ల దళిత సంఘాలు అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తుండటంతో వారిని సముదాయించలేక అధికారులు సతమతమవుతున్నారు. దళిత బంధు పధకం టిఆర్ఎస్‌కు ఏమేరకు రాజకీయంగా లబ్ధి కలిగిస్తుందో తెలీదు కానీ రాష్ట్రంలోని దళితులందరికీ ఈ పధకాన్ని వర్తింపజేయడం చాలా కష్టం కనుక దాని కోసం ఎదురుచూపులు చూస్తున్నవారి ఆగ్రహం టిఆర్ఎస్‌కు చాలా నష్టం కలిగించవచ్చు.