తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఇప్పుడు బాగా తగ్గాయి. కనుక మళ్ళీ పాఠశాలలు తెరవాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలతో కూడిన ఫైలును సిఎం కేసీఆర్‌కు పంపించారు. సిఎం కేసీఆర్ అనుమతిస్తే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి దశలవారీగా పాఠశాలలు తెరిచి ప్రత్యక్ష పద్దతిలో తరగతులు నిర్వహించాలని భావిస్తున్నారు.
కానీ త్వరలోనే మళ్ళీ కరోనా థర్డ్ వేవ్ మొదలవుతుందనే నిపుణులు, శాస్త్రవేత్తల హెచ్చరికలు చేస్తుండటంతో అధికారులు కూడా పాఠశాలలు పునః ప్రారంభించాలని గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఇంతవరకు 18 ఏళ్ళలోపు పిల్లలకి కరోనా సోకకుండా టీకాలు కూడా వేయలేదు. ఉపాధ్యాయులు పాఠశాలలో ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నప్పటికీ విద్యార్దులు పాఠశాలలకు వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు బస్సులు, ఆటోలు ఎక్కివస్తుంటారు. కనుక కరోనా బారినపడే ప్రమాదం ఉంటుంది. విరామ సమయాలలో విద్యార్దులను ఎంత కట్టడి చేసినా వారు గుమిగూడకుండా, ఆడుకోకుండా ఆపడం కష్టం. కనుక పాఠశాలలో ఒక్క విద్యార్ధికి కరోనా సోకినా మిగిలిన విద్యార్దులందరికీ అది వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ విద్యార్దులకు కరోనా సోకితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. తల్లితండ్రులు, మీడియా, సమాజం అందరూ కూడా ప్రభుత్వాన్నే నిందిస్తారు. కనుక పాఠశాలలు తెరిచి తరగతులు నిర్వహించడం కత్తిమీదసాము వంటిదేనని చెప్పవచ్చు. మరి సిఎం కేసీఆర్ ఏమి నిర్ణయం తీసుకొంటారో చూడాలి.