ఇటీవల ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ అధ్వర్యంలో నిర్వహించిన ‘దండోరా సభ’ విజయవంతమవడంతో ఆ పార్టీ నేతలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అదే ఊపులో భువనగిరి పార్లమెంటు పరిధిలోని మరో సభ నిర్వహించేందుకు సిద్దమయ్యారు. ఈనెల 18వ తేదీన ఇబ్రహీంపట్టణంలో దండోరా సభ నిర్వహించబోతునట్లు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలోనే ప్రకటించారు. కానీ రేవంత్ రెడ్డి నిర్ణయంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు ముందుగా చెప్పకుండా తన పార్లమెంటు పరిధిలో సభ నిర్వహించడం సరికాదన్నారు. ఈనెల 17 నుంచి 21 వరకు పార్లమెంటరీ స్టాండింగ్ కౌన్సిల్ అధ్వర్యంలో గోవాలో స్టడీ టూర్‌కి వెళుతున్నానని కనుక 18న ఇబ్రహీంపట్టణంలో దండోరా సభ పెడితే దానికి తాను హాజరుకాలేనన్నారు. తాను లేకుండా తన పార్లమెంటు నియోజకవర్గంలో సభ నిర్వహించడం సరికాదని అభ్యంతరం తెలిపారు. ఈ విషయం కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి కూడా వెళ్ళినట్లు తెలుస్తోంది. దీంతో రేవంత్ రెడ్డి నిన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఫోన్ చేసి ఆయన కోరినట్లే అక్కడ సభను నిర్వహించనని చెప్పడంతో సమస్య సద్దుమణిగినట్లు తెలుస్తోంది.
ఇప్పుడు చేవెళ్ళ లోక్‌సభ పరిధిలోని మహేశ్వరం సమీపంలో దండోరా సభ నిర్వహించేందుకు తగిన స్థలం కోసం కాంగ్రెస్ నేతలు వెతుకుతున్నారు. ముందే ప్రకటించినట్లు ఈనెల 18న ఆ సభ నిర్వహించవచ్చు.