ఒక్కో ఉపఎన్నికలో ప్రత్యర్ధులు మారిపోతున్నారే!

August 13, 2021


img

తెలంగాణ రాష్ట్రంలో కాస్త విచిత్రమైన రాజకీయ వాతావరణం నెలకొని ఉందని చెప్పవచ్చు. ఇందుకు ఉదాహరణగా మూడు ఉపఎన్నికలను చెప్పుకోవచ్చు. దుబ్బాక ఉపఎన్నికలో టిఆర్ఎస్‌కు ప్రధాన ప్రత్యర్ధి బిజెపికాగా, సాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యర్ధిగా ఉంది. ఇప్పుడు హుజూరాబాద్‌ ఉపఎన్నికలో మళ్ళీ బిజెపి ప్రత్యర్ధిగా నిలుస్తోంది. గ్రేటర్ ఎన్నికలలో కూడా టిఆర్ఎస్‌కు బిజెపి ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచిన సంగతి తెలిసిందే. 

ఇందుకు కారణం అందరికీ తెలిసిందే. ఫిరాయింపులతో కాంగ్రెస్‌ బలహీనపడటంతో దాని స్థానంలోకి బిజెపి ప్రవేశించి టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా నిలిచింది. కానీ సాగర్ ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీ తమ సీనియర్ నాయకుడు కె.జానారెడ్డిను బరిలోకి దింపడం, అక్కడ బిజెపికి బలమైన అభ్యర్ధి లేకపోవడంతో ఆ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌-కాంగ్రెస్‌ మద్య పోరు జరిగింది. 

హుజూరాబాద్‌లో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందిన ఈటల రాజేందర్‌ బిజెపిలో చేరడంతో ఇప్పుడు టిఆర్ఎస్‌-బిజెపి మద్య జరుగబోయే భీకర పోరాటం జరుగబోతోంది. ఒకవేళ ఈటల రాజేందర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరి ఉంటే నేడు హుజూరాబాద్‌ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌-కాంగ్రెస్ పార్టీలు ప్రత్యర్ధులుగా నిలిచి ఉండేవి. 

పిసిసి అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి పగ్గాలు చేపట్టిన తరువాత జరుగబోతున్న మొట్ట మొదటి ఉపఎన్నిక ఇది. కనుక ఒకవేళ ఆయన ఈటల రాజేందర్‌ కంటే బలమైన అభ్యర్ధిని బరిలో దించినట్లయితే, అప్పుడు పోరు టిఆర్ఎస్‌-కాంగ్రెస్ పార్టీల మద్యకు మారుతుంది. కానీ టిఆర్ఎస్‌-బిజెపిల మద్య నలిగిపోయేందుకు కాంగ్రెస్‌ నేతలెవరూ సాహసించడం లేదు. కనుక ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ ప్రత్యర్ధిగా మళ్ళీ బిజెపి నిలుస్తోంది.


Related Post