ఇక్కడ షర్మిల...అక్కడ లోకేష్ పోరాటాలు దేనికో?

August 13, 2021


img

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇక్కడ తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై పోరాడుతుండగా, అక్కడ ఏపీలో టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌, ఆమె అన్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంతో పోరాడుతున్నారు. వైఎస్ షర్మిల తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకొన్న నిరుద్యోగులను గుర్తించి వారి కుటుంబాలను ఓదార్చి దీక్షలు చేస్తూ కేసీఆర్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండగా, అక్కడ ఏపీలో నారా లోకేష్‌ కూడా అదే చేస్తున్నారు. ఉద్యోగాల కల్పనలో కేసీఆర్‌, జగన్‌ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఇద్దరూ ఆరోపిస్తున్నారు.  

నెల్లూరు పట్టణంలో కమల్ అనే నిరుద్యోగి ఈనెల 1వ తేదీన ఆత్మహత్య చేసుకొన్నాడు. నారా లోకేష్‌ అతని కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు వెళ్ళగా ఇల్లు తాళం వేసి ఉంది. అనంతరం నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “ఉద్యోగం కోసం పదేళ్ళుగా ఎదురుచూస్తున్న కమల్ ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అతని కుటుంబానికి రూ.25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలి. రాష్ట్రంలో ఇప్పటివరకు 300 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఉద్యోగాలు కల్పించలేకపోయినా కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదు. టిడిపి అధికారంలోకి వస్తే నిరుద్యోగులందరికీ రూ.2000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాము,” అని అన్నారు.   

ఇక్కడ తెలంగాణలో వైఎస్ షర్మిల కూడా ఇంచుమించు ఇలాగే విమర్శలు చేస్తూ హామీలు ఇస్తున్నారు. అయితే వీరి పోరాటాలు నిజంగా నిరుద్యోగుల కోసమేనా లేక రాజకీయంగా తమ ఉనికిని చాటుకొంటూ పార్టీని బలోపేతం చేసుకొనేందుకా? అనే సందేహం కలుగక మానదు. ఎందుకంటే ఇరువురూ కూడా సమస్యల గురించి మాట్లాడేటప్పుడు తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం గురించి కూడా మాట్లాడుతున్నారు. వస్తే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. అంటే వారి లక్ష్యం అధికారం సాధించడమేనని అర్దమవుతోంది. ఎంతైనా వారివురు కూడా రాజకీయ నిరుద్యోగులే కదా? 


Related Post