మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ సుమారు రెండేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరింపబడినప్పటి నుంచి ఏ పార్టీలోను చేరకుండా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆ స్థాయి వరకు ఎదిగిన రాజకీయ నాయకుడు ఎల్లకాలం చేతులు ముడుచుకొని కూర్చోవడం చాలా కష్టమే. బహుశః అందుకే ఆయన టిఆర్ఎస్‌వైపు చూస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు.
నిన్న హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినప్పుడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, “దళిత బంధు పధకం ఓ అద్భుతమైన పధకం. దాంతో దళితుల జీవితాలు పూర్తిగా మారిపోతాయి. ఈ పధకంతో రాష్ట్రంలో దళితులు ఆర్ధికంగా అభివృద్ధి చెందడమే కాకుండా మరో పది మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతారని నేను నమ్ముతున్నాను. కనుక దీనిని నేను స్వాగతిస్తున్నాను. ఇటువంటి గొప్ప పధకం తెచ్చినందుకు సిఎం కేసీఆర్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆయన నిర్ణయాలకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను. దళిత బంధు పధకంపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం మానుకొని రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.