హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం టిఆర్ఎస్, ఈటల రాజేందర్ చాలా ఆత్రంగా ఉన్నప్పటికీ మరో రెండు నెలల వరకు జరిగే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే, 2021-2022 సం.లలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలలో, అలాగే హుజూరాబాద్‌తో సహా పలు రాష్ట్రాలలో ఉపఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ నేటికీ దేశంలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నందున, ఈ పరిస్థితులలో ఎన్నికలు నిర్వహించాలా వద్దా? ఎన్నికల నిర్వహణపై ఆగస్ట్ నెలాఖరులోగా సలహాలు, సూచనలు పంపించవలసిందిగా కోరుతూ కేంద్ర ఎన్నికల కమీషన్ (సీఈసీ) రాజకీయ పార్టీలకు లేఖలు వ్రాసింది. పార్టీల అభిప్రాయాలూ, సూచనలు, సలహాల ఆధారంగా నిర్ణయం తీసుకొని మార్గదర్శకాలు రూపొందిస్తామని సీఈసీ కార్యదర్శి అరుణ్ కుమార్ ఆ లేఖలలో పేర్కొన్నారు.
దీనిపై ప్రతిపక్షాలు స్పందించి తమ అభిప్రాయాలు తెలియజేసేందుకు, సీఈసీ వాటినన్నిటినీ పరిశీలించి నిర్ణయం తీసుకొనేందుకు రెండు మూడు వారాలు పట్టొచ్చు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించదలిస్తే సెప్టెంబర్ రెండవ లేదా మూడవ వారంలో నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు. ఆ లెక్కన అక్టోబర్ నెలాఖరుకి లేదా నవంబర్ మొదటి వారంలో హుజూరాబాద్ ఉపఎన్నిక జరగవచ్చు.
ఇప్పటికే టిఆర్ఎస్ గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను అభ్యర్ధిగా ప్రకటించి ఎన్నికల ప్రచారం కూడా చేస్తోంది. బిజెపి తరపున ఈటల రాజేందర్ గత రెండు నెలలుగా నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా నేడో రేపో తమ అభ్యర్ధిని ప్రకటించి ప్రచారం మొదలుపెడుతుంది. ఉపఎన్నిక ఆలస్యమైతే ఎన్నికల ప్రచారానికి పార్టీలకు చాలా సమయం లభిస్తుంది కానీ అప్పటి వరకు ఎన్నికల ప్రచారం కొనసాగించడం ఆర్ధికంగా చాలా భారం అవుతుంది కూడా.