ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకొంటుండంతో అక్కడి ప్రజల పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోంది. తాలిబన్లు కండూజ్ విమానాశ్రయాన్ని ఆక్రమించుకోవడంతో అక్కడ నిలిపి ఉన్న ఎంఐ-24 హెలికాప్టర్ వారి చేతికి చిక్కింది. 2019లో భారత్ దానిని ఆఫ్ఘనిస్తాన్‌కి బహుమతిగా ఇచ్చింది. దాంతో పాటు మూడు చీతా హెలికాప్టర్లను కూడా బహుమతిగా ఇచ్చింది. తాలిబన్లు కండూజ్ విమానాశ్రయాన్ని ఆక్రమించుకొన్న తరువాత దాని పక్కన నిలబడి ఫోటోలు తీసుకొని అది తమ అధీనంలో ఉందని తెలియజేసేందుకు ఆ ఫోటోలను మీడియాకు విడుదల చేశారు. అయితే ఆఫ్ఘాన్ సైనికులు ముందు జాగ్రత్త చర్యగా దాని బ్లేడ్స్ (రెక్కలు) తీసివేయడంతో తాలిబన్లు శక్తివంతమైన ఎంఐ-24 హెలికాప్టర్ చేతిలో ఉన్నప్పటికీ దానిని ఉపయోగించలేరు.
అమెరికా సేనలు ఆఫ్ఘనిస్తాన్‌కు తాలిబన్ల నుంచి విముక్తి చేసి రక్షణ కల్పించగా భారత్ ఆ దేశ పునర్నిర్మాణంలో ఇంతకాలం పాలుపంచుకొంది. కానీ ఇప్పుడు అమెరికా సేనలు వెనక్కు వెళ్ళిపోవడంతో భారత్ కూడా తాలిబన్లు అడ్డుకొనే పరిస్థితిలో లేదు. అఫ్గాన్ పునర్నిర్మాణంలో పాలుపంచుకొంటున్న భారతీయ సంస్థలు, వాటి ఇంజనీర్లు, కార్మికులు అందరూ ప్రాణాలు అరచేత పట్టుకొని అక్కడి నుంచి పారిపోయివస్తున్నారు. తాలిబన్లను ఎదిరించేవారే లేకపోవడంతో వారు మరింత రెచ్చిపోయి విధ్వంసం సృష్టిస్తున్నారు. నిత్యం వేలాదిమంది ప్రజలు వారికి బలవుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఇంత విధ్వంసం జరుగుతున్నా ఐక్యరాజ్య సమితి ఏమి చేస్తోందో...మీసం మేలేసే అగ్రరాజ్యాలేమి చేస్తున్నాయో తెలీదు.