హుజూరాబాద్ ఉపఎన్నికకు టిఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో దిగుతున్నారు. బిజెపి అభ్యర్ధిగా ఈటల రాజేందర్ లేదా ఆయన భార్య జమున బరిలో దిగవచ్చు. కానీ కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరనేది ఇంతవరకు తెలీదు. రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత జరుగుతున్న మొదటి ఎన్నికలు కనుక ఆయనఈ కూడా ఈ ఉపఎన్నిక అగ్నిపరీక్ష వంటిదేనని చెప్పుకోవచ్చు.
కాంగ్రెస్ తరపున హుజూరాబాద్ నుంచి పోటీ చేయాలని భావించిన కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్‌లో చేరే ముందు “హుజూరాబాద్ ఉపఎన్నికలో మనం గెలవలేమని” పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనతో అన్నారని చెప్పారు. పార్టీ అధ్యక్షుడికే గెలుస్తామనే నమ్మకం లేకపోతే ఎలా అని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన మాటలు అబద్దం అనుకోలేము కనుక ఈ ఉపఎన్నికను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్దంగా లేదని భావించవచ్చు.
ఈ ఉపఎన్నికను సిఎం కేసీఆర్, ఈటల రాజేందర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నందున, కాంగ్రెస్ గెలుపు మాట దేవుడెరుగు...కనీసం డిపాజిట్ దక్కించుకొన్నా అది గొప్ప విషయమే అవుతుంది. కనుక కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో దిగేందుకు ఎవరూ సాహసించడం లేదని సమాచారం.
ఒకవేళ ఈ ఉపఎన్నికలో గెలిచినా శాసనసభలో ప్రతిపక్ష బెంచీలో కూర్చొని టిఆర్ఎస్‌ను భరించవలసి ఉంటుంది. అదీగాక శాసనసభ ఎన్నికలకు మరో రెండున్నరేళ్ళు సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈసారి కూడా సిఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళినా ఆశ్చర్యం లేదు. కనుక గెలిచే అవకాశం చాలా తక్కువని, ఒకవేళ గెలిచిన రెండున్నర లేదా ఇంకా ముందే ముగిసిపోయే ఈ ఎమ్మెల్యే పదవి కోసం కోట్లు ఖర్చు పెట్టేందుకు ఎవరు ముందుకు వస్తారు?అని ఆలోచిస్తే కాంగ్రెస్ పరిస్థితి అర్ధమవుతుంది.
పొన్నం ప్రభాకర్, కవ్వంపల్లి సత్యనారాయణ, పత్తి కృష్ణారెడ్డి, మహేందర్ రెడ్డి, కొండా సురేఖలలో ఎవరో ఒకరిని బరిలో దింపాలని రేవంత్ రెడ్డి, హుజూరాబాద్ ఉపఎన్నిక ఇన్-ఛార్జ్ దామోదర రాజనరసింహ ఆలోచిస్తున్నట్లు తాజా సమాచారం. కానీ వారిలో కొండా సురేఖ తప్ప మిగిలిన వారందరూ పోటీ చేసేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. కనుక ఈ శనివారం పార్టీ అభ్యర్ధిపై చర్చించి ప్రకటించనున్నట్లు సమాచారం.