తెలంగాణ ప్రభుత్వం ప్రతిపక్షాలపై ప్రయోగించిన బ్రహ్మాస్త్రంగా భావించబడుతున్న దళిత బంధు పధకాన్ని ఇప్పటికే వాసాలమర్రి గ్రామంలో ప్రారంభించింది. ఈనెల 16న హుజూరాబాద్‌లో టిఆర్ఎస్ నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో సిఎం కేసీఆర్ దానిని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తరువాత ఈ పధకాన్ని రాష్ట్రమంతటా అమలుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కనుక ఆలోగా దీనికి శాసనసభ ఆమోదంతో చట్టబద్దత కల్పించి, ఈ వ్యవస్థకు ఛైర్మన్ నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది.
టిఆర్ఎస్‌లో చేరేందుకు సిద్దంగా ఉన్న మోత్కుపల్లి నర్సింహులుకు దళిత బంధు పధకానికి ఛైర్మన్‌గా నియమించాలని సిఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే కనుక జరిగితే, గత పదేళ్ళుగా రాజకీయంగా వెనకబడిపోయిన మోత్కుపల్లి దశ తిరిగినట్లే భావించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం దీనిని చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తుండగా, ఇది కేవలం ఎన్నికల కోసం తెరపైకి తెచ్చిన పధకమని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కనుక వచ్చే శాసనసభ ఎన్నికల వరకు ఈ పధకంపై రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మద్య నిరంతరం వాదోపవాదాలు, విమర్శలు ప్రతివిమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతూనే ఉంటాయి. అప్పుడు దళిత బంధు ఛైర్మన్‌గా మోత్కుపల్లి గట్టిగా మాట్లాడుతూ సిఎం కేసీఆర్‌ని మెప్పించగలిగితే వచ్చే శాసనసభ ఎన్నికలలో టిఆర్ఎస్ టికెట్ కూడా లభించవచ్చు.