ఆఫ్ఘనిస్తాన్‌లో క్రికెటర్ రషీద్ ఖాన్ ఆవేదన ఇది. తమ దేశం పరిస్థితి చూసి తీవ్ర ఆవేదనతో తమ దేశాన్ని, ప్రజలను కాపాడవలసిందిగా ప్రపంచదేశాధినేతలకు విజ్ఞప్తి చేశారు. “ప్రపంచదేశానేతల్లారా....నా దేశం ప్రస్తుతం చాలా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రతీరోజు మహిళలు, చిన్నారులతో వేలాదిమంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజల ఇళ్ళు, ఆస్తులు ధ్వంసం అవుతుండటంతో వేలాది కుటుంబాలు నిర్వాసితులవుతున్నాయి. నా దేశాన్ని ఇలా విడిచిపెట్టేయకండి. దయచేసి చొరవ తీసుకొని ఆఫ్ఘన్ ప్రజల మరణాలను ఆపండి. ఆఫ్ఘనిస్తాన్ కుప్పకూలిపోకుండా కాపాడండి. మాకు శాంతి కావాలి,” అంటూ తన దేశాన్ని కాపాడవలసిందిగా చేతులెత్తి వేడుకొంటున్న ఇమోజీని పోస్ట్ చేశాడు.
దశాబ్ధాలుగా అమెరికా సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబన్ తీవ్రవాదుల నుంచి కాపాడారు. కానీ ఈ ఏడాది మే 1వ తేదీ నుంచి దశలవారీగా అమెరికా సేనలు స్వదేశానికి తిరిగి వెళ్ళిపోవడం మొదలుపెట్టాక తాలిబన్లు మళ్ళీ రెచ్చిపోయి విధ్వంసం సృష్టిస్తూ ఆఫ్ఘనిస్తాన్‌లో 400 జిల్లాలను, పలు నగరాలను తమ అధీనంలో తెచ్చుకొని ప్రజలకు రోజూ నరకం చూపిస్తున్నారు.
ఆఫ్ఘనిస్తాన్ సైనికులు వారితో పోరాడుతూ మరణిస్తున్నారు. తాలిబన్లను ఎదుర్కొలేని సైనికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోతున్నారు. దీంతో తాలిబన్లను అడ్డుకొనేవారే లేకపోవడంతో వారు మరింత రెచ్చిపోతూ విధ్వంసం సృష్టిస్తున్నారు. త్వరలోనే ఆఫ్ఘన్ ప్రభుత్వం వారి వశమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే దశాబ్ధాలుగా అమెరికా సేనలు వారితో చేసిన పోరాటాలు, వారి బలిదానాలు అన్నీ వృధా అయినట్లే.
దేశం మళ్ళీ తాలిబన్ల గుప్పెట్లోకి వెళ్లిపోతే పొరుగునే ఉన్న భారత్, పాకిస్థాన్‌లతో సహా యావత్ ప్రపంచ దేశాలకు ఏదో ఓ రోజు వారితో ముప్పు తప్పదు. అంతకంటే ముందు ఆ దేశంలో నివశిస్తున్న ప్రజల జీవితాలు దుర్బరమైపోతాయి. ఈ విషయం ఐక్యరాజ్య సమితితో సహా అన్ని దేశాలకు తెలుసు. కానీ ఎవరూ నోరు మెదపకుండా ఆఫ్ఘనిస్తాన్‌లో జరుగుతున్న విధ్వంసాన్ని, మారణఘోమాన్ని ప్రేక్షకుల్లా చూస్తున్నారు. అందుకే రషీద్ తమ దేశాన్ని కాపాడలంటూ వేడుకొంటున్నాడు. మరి ఆఫ్ఘనిస్తాన్ ప్రజల తరపున అతని మొర ఎవరైనా ఆలకిస్తారా? ఆ దేశాన్ని, ప్రజలను ఎవరైనా కాపాడుతారా?