హుజూరాబాద్ ఉపఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా టిఆర్ఎస్ విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును సిఎం కేసీఆర్ ఖరారు చేశారు. కొద్దిసేపటి క్రితం ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్ స్వయంగా శ్రీనివాస్ యాదవ్‌ను తమ పార్టీ అభ్యర్ధిగా నిర్ణయించినట్లు ప్రకటించారు.
హుజూరాబాద్ ఉపఎన్నికలో కూడా నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఫార్ములానే సిఎం కేసీఆర్ అమలుచేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. దీంతో అవి నిజమని రుజువైంది. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో అపార రాజకీయ అనుభవం కలిగిన కె.జానారెడ్డిను ఓడించేందుకు రాజకీయాలలో పెద్దగా అనుభవం లేని నోముల భగత్‌ను బరిలో దించడం సంచలనం సృష్టించింది. కానీ సిఎం కేసీఆర్ వ్యూహం ఫలించి నోముల చేతిలో ఓడిపోవడంతో రాజకీయంగా కె.జానారెడ్డి ప్రతిష్ట మసకబారింది.
ఇప్పుడు అదే ఫార్ములాతో ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బరిలో దించుతున్నారు. శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించుకొనేందుకు టిఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డి పోరాడుతుంది కనుక ఇప్పుడు బంతి ఈటల రాజేందర్ కోర్టులోనే ఉన్నట్లు భావించవచ్చు.
ఈ ఉపఎన్నికలో తన గెలుపు ఖాయమని ఈటల ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన గెలిస్తే సిఎం కేసీఆర్‌పై రాజకీయ ప్రతీకారం తీర్చుకొన్నట్లవుతుంది. కానీ ఒకవేళ శ్రీనివాస్ యాదవ్ చేతిలో ఓడిపోతే ఈటల రాజేందర్ ప్రతిష్ట మసకబారుతుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో పట్టు కోల్పోతారు కూడా. కనుక ఇది ఆయనకు జీవన్మరణ సమస్య వంటిదే అని చెప్పవచ్చు. అటువంటి దుస్థితి వద్దనుకొంటే ఆయన పోటీ నుంచి విరమించుకొని భార్య జమునను లేదా వేరెవరినైనా బరిలో దింపవలసి ఉంటుంది.
టిఆర్ఎస్ అభ్యర్ధిగా శ్రీనివాస్ యాదవ్ పేరు ఖరారైనందున నేటి నుంచి ఆయన కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో జోరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కూడా వెంటనే తమ అభ్యర్ధులను ప్రకటించక తప్పదు లేకుంటే ఆ పార్టీలు ఎన్నికల ప్రచారంలో వెనకబడిపోతాయి.