వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల, రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకొంటున్న నిరుద్యోగులను గుర్తించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చుతూ నిరుద్యోగ దీక్షల పేరుతో అందరి దృష్టినీ ఆకర్షించి పార్టీని బలపరుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె సిఎం కేసీఆర్...ఆయన ప్రభుత్వం, పాలనను తీవ్రంగా విమర్శిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏనాడూ ఆమె ఓదార్పు యాత్రలు, దీక్షలను అడ్డుకోలేదు. అభ్యంతరం చెప్పడంలేదు. కాంగ్రెస్, బిజెపిలు సిఎం కేసీఆర్‌ను విమర్శిస్తే ఒంటికాలిపై లేచి నిప్పులు చెరిగే టిఆర్ఎస్ నేతలు ఆమె విమర్శలు, ఆరోపణలను పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరమే.
అయితే ఇటీవల బీఎస్పీలో చేరిన ప్రవీణ్ కుమార్ నల్గొండ సభలో దళిత బంధు పధకంపై విమర్శలు చేయగానే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం విశేషం. ఆయన బిజెపి ఏజంట్ అని, బిజెపి ఆయనను అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో టిఆర్ఎస్‌ను రాజకీయంగా దెబ్బ తీసేందుకు కుట్రలు పన్నుతోందని టిఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆరోపించారు.
అంటే వైఎస్ షర్మిలను టిఆర్ఎస్ మిత్రురాలిగా భావిస్తోంది లేదా ఆమె వలన టిఆర్ఎస్‌కు పరోక్షంగా లబ్ధి కలుగుతుందని కానీ ప్రవీణ్ కుమార్ వలన టిఆర్ఎస్‌కు ప్రమాదం పొంచి ఉందని టిఆర్ఎస్ భావిస్తున్నట్లు అర్దం అవుతోంది.
ప్రవీణ్ కుమార్ రాష్ట్రంలో వివిద పార్టీల మద్య చీలిపోయిన బడుగు బలహీన వర్గాల ఓటర్లందరినీ ఆకట్టుకొని వారిని బీఎస్పీవైపు ఆకర్షించగలిగితే వారి ఓట్లపైనే మనుగడ సాగిస్తున్న టిఆర్ఎస్‌కు వచ్చే ఎన్నికలలో తీవ్రంగా నష్టం కలుగుతుందని ఆందోళన చెందుతోందేమో?బహుశః అదుకే ఆయనపై టిఆర్ఎస్ నేతలు నిప్పులు చెరగడం ప్రారంభించారనుకోవచ్చు. లేకుంటే ప్రొఫెసర్ కోదండరాం, వైఎస్ షర్మిలలాగే ఆయనను పట్టించుకోకుండా ఉండేవారు కదా?