ఒలింపిక్స్‌లో గెలిచి పతకాలతో తిరిగివస్తున్న క్రీడాకారులను కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు, మీడియా ప్రశంసలతో ముంచెత్తుతున్నాయి. వారికి భారీ నజరానాలు ముట్టజెపుతున్నాయి. చాలా సంతోషం! ఈ క్రీడాకారులలో చాలామంది నిరుపేద, మద్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినవారే. వారు ఈ స్థాయి వరకు వచ్చేందుకు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో?ఎన్ని కష్టాలు అనుభవించారో?ఎంత వేదన అనుభవించారో? ఎవరికీ తెలియదు. తమ శక్తిమేర తమ పరిధిలో ఉన్న అవకాశాలను వినియోగించుకొంటూ ఒంటరి పోరాటం చేస్తూ అతికష్టం మీద ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరికి ఈ స్థాయికి చేరుకొన్నారు.
ఇందుకు హెవీ వెయిట్ లిఫ్టింగులో రజత పతకం సాధించిన మీరాబాయి చాను ఓ ప్రత్యక్ష ఉదాహరణ. నేడు దేశవ్యాప్తంగా మీడియాలో ఆమె ఉదార గుణం గురించి కధనాలు వచ్చాయి. అయితే వాటిలోనే ఆమె ఈ స్థాయికి చేరుకొనేందుకు ఎన్ని కష్టాలు అనుభవించారో కూడా కళ్ళకు కట్టినట్లు కనబడుతోంది.
ఒలింపిక్స్‌లో పతకం సాధించేవరకు మీరాబాయి చాను అంటే ఎవరో దేశప్రజలకు తెలియదు ఆమెకు ప్రతీరోజు లిఫ్టు ఇచ్చిన లారీ డ్రైవర్లకు తప్ప! మణిపూర్‌లోని తూర్పు ఇంఫాల్‌లోని మారుమూల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె రోజూ 30 కిమీ దూరంలో ఉండే శిక్షణా కేంద్రానికి (అకాడమీ) వెళ్ళేందుకు సొంత వాహనం లేదు కనీసం చేతిలో డబ్బు ఉండేది కాదు. అప్పుడు ప్రతీరోజు ఆమె ఆ దారిలో వెళ్ళే ట్రక్కు డ్రైవర్లను బ్రతిమాలుకొని వెళ్ళి వస్తుండేవారు. ఇదీ భారత్‌కు ఒలింపిక్ అవార్డు తెచ్చిపెట్టిన ఓ మహిళ పరిస్థితి.
ఆమె ఒలింపిక్స్‌లో పతకం సాధించి స్వరాష్ట్రానికి తిరిగి వచ్చిన తరువాత ఇన్నేళ్ళుగా తనను ఆదరించి ఉడతాభక్తిగా సాయపడిన 150 మంది ట్రక్కు డ్రైవర్లను తన ఇంటికి ఆహ్వానించి వారికి భోజనం, బట్టలు పెట్టి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
ఇక్కడ ఆమె ఔదార్యం గురించి చెప్పుకోక తప్పదు. కానీ దీంతో ఆమె ఎన్ని కష్టాలు అనుభవించారో కూడా కళ్ళకు కట్టినట్లు కనబడుతోంది. మన ఒలింపిక్ క్రీడాకారులలో చాలామందికి ఇటువంటి కష్టాలు, కన్నీళ్ళు చవిచూసినవారే. పతకాలు సాధించిన తరువాత కూడా నిరాధారణకు గురైనవారూ కోకొల్లలున్నారు. కోల్‌కతాలో హౌరా బ్రిడ్జిపై పారిశుద్య కార్మికుడిగా, హర్యానాలో రోడ్డుపక్కన టీ దుకాణం నడుపుకొంటూ, మరో రాష్ట్రంలో పెంటకుప్పలలో నుంచి ప్లాటిక్ బాటిల్స్ ఏరుకొని జీవనం సాగిస్తున్నవారూ ఉన్నారు.
ఒలింపిక్స్ వరకు వెళ్ళేందుకు, పతకాలు సాధించి తిరిగి వచ్చిన తరువాత క్రీడాకారులు ఇంత దయనీయమైన జీవితాలు గడుపుతుంటే ఒలింపిక్స్‌లో పతకాలు సాధించలేదని వారిని ఏవిదంగా నిందించగలం? ఇకనైనా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేట్ కంపెనీలు, సమాజం అందరూ మన క్రీడాకారులు ఒంటరి పోరాటాలు చేస్తున్న దశలోనే అవసరమైన సహాయసహకారాలు అందిస్తే వారు భారత్‌కు మెడల్స్ తీసుకురాగలరు. ఆకాశమంత ఎత్తున భారత్ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించగలరు.