తెలంగాణ ప్రభుత్వం హడావుడిగా ప్రకటించి అమలుచేస్తున్న లక్షల కోట్లు ఖర్చయ్యే దళిత బంధు పధకానికి ఇంతవరకు ఎటువంటి మార్గదర్శకాలు జారీ చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కనీసం ఈ పధకానికి లోగోను కూడా రూపొందించలేదు. ఈనెల 16వ తేదీన హుజూరాబాద్‌లో దీనిని సిఎం కేసీఆర్ ప్రారంభిస్తారని చెప్పినందున ఆలోగా లోగో, మార్గదర్శకాలు విడుదల చేస్తుందనుకొంటే, ఈ పధకం ప్రారంభించక ముందే సిఎం కేసీఆర్ వాసాలమర్రి గ్రామంలో పర్యటించి 76 దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున రూ.7.6 కోట్లు విడుదల చేయించారు!
ఈ పధకానికి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంతో ఈ పధకానికి ఎవరు అర్హులు?వారి ఎంపికలో ఎటువంటి నిబందనలు పాటించాలి?వారిని ఎవరు ఏ ప్రాతిపదికన ఎంపిక చేయాలి? అనే విషయాలపై అధికారులలో గందరగోళం నెలకొని ఉంది.
ఈనెల 16న హుజూరాబాద్‌లో ఈ పధకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలుచేస్తామని సిఎం కేసీఆర్ ప్రకటించినందున కరీంనగర్ జిల్లా అధికారులు లబ్దిదారులను ఏ ప్రాతిపదికన ఎంపిక చేయాలో తెలియక తలలు పట్టుకొంటున్నారు. నియోజకవర్గంలో దళిత కుటుంబాలన్నిటికీ కాకుండా మొదటి దశలో ఒక్కో ఊరు నుంచి 20 దళిత కుటుంబాలకి మాత్రమే ఈ పధకం ద్వారా సొమ్మును అందజేస్తామని అధికారులు చెపుతుండటంతో దీని కోసం దళిత కుటుంబాల మద్య పోటీ మొదలైంది. ఈ పధకానికి అర్హులు వేలసంఖ్యలో ఉండగా కొద్దిమందికి ఇది లభించే అవకాశం ఉండటంతో అందరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉపఎన్నిక తరువాత ఈ పధకాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుందో లేదో అనే అనుమానంతో అందరూ తొలివిడతలోనే ఈ సొమ్మును దక్కించుకోవడానికి అధికారుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు.
ఈ పధకానికి ఎటువంటి మార్గదర్శకాలు లేకపోవడంవలన అధికారులు అనేకానేక సమస్యను ఎదుర్కొంటున్నారు. దీంతో రోజురోజుకీ వారిపై ఒత్తిడి పెరిగిపోతోంది. పైగా అధికార పార్టీ నాయకులు సిఫార్సులు ఉండనే ఉంటాయి. వారిని కాదని ఎంపిక చేయడం దాదాపు అసంభవమే కనుక అధికారులు మరింత ఒత్తిడికి లోనవుతున్నారు. కనుక ప్రభుత్వం ఈ పధకానికి తక్షణమే మార్గదర్శకాలు విడుదల చేయవలసిన అవసరం ఉంది.