విరిగిపడ్డ పులిచింతల ప్రాజెక్టు గేటు..5 లక్షల క్యూసెక్కులు నీళ్ళు వృధా

August 06, 2021


img

గుంటూరు జిల్లా మద్దిపాడులోని పులిచింతల ప్రాజెక్టుకు అమర్చిన 24 గేట్లలో ఒకటి విరిగిపడింది. పులిచింతల ప్రాజెక్టు సామర్ధ్యం 45.77 టీఎంసీలు. గురువారం ఉదయానికి ప్రాజెక్టులో 44 టీఎంసీలు నీళ్ళు నిలువ ఉండటంతో సిబ్బంది గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండగా సుమారు 250 టన్నులు బరువుండే 16వ నెంబర్ గేట్ విరిగిపడింది. దీంతో మిగిలిన గెట్లపై ఒత్తిడి తగ్గించేందుకు 16 గేట్లు ఎత్తివేసి నీటిని విడిచిపెడుతున్నారు. ప్రాజెక్టులో నుంచి 5 లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా పోయింది. 

ఒకేసారి 16 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో దిగువన ఉన్న గ్రామాలలో ప్రజలను కృష్ణా, గుంటూఋ జిల్లా అధికారులు అప్రమత్తం చేశారు. ప్రాజెక్టులో నీటి మట్టం 42 మీటర్లకు తగ్గించి విరిగిన గేటు స్థానంలో స్టాప్ లాగ్ గేట్ (తాత్కాలిక గేటు)ను అమర్చేందుకు ప్రాజెక్టు ఇంజనీర్లు, ప్రాజెక్టు కాంట్రాక్టింగ్ కంపెనీ ఇంజనీర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ స్థాయికి నీటిమట్టం తగ్గిస్తే ప్రాజెక్టులో అప్పుడు కేవలం 10 టీఎంసీలు నీళ్ళు మాత్రమే మిగులుతాయి. అప్పుడు ఒత్తిడి తగ్గుతుంది కనుక తాత్కాలిక గేటు అమర్చవచ్చని నిపుణులు భావిస్తున్నారు. 

ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్, మంత్రులు పేర్నినాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఈఎన్‌సీ నారాయణ రెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్ సూర్యనారాయణ తదితరులు అక్కడకు చేరుకొని పరిస్థితి స్వయంగా అంచనావేసి ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డికి తెలియజేశారు. ఈ ప్రాజెక్టు ప్రారంభించిన మూడేళ్ళకే ఓ గేటు విరిగిపడటంతో ఇది నాణ్యతాలోపమా లేదా సాంకేతిక లోపమా నిర్వహణా లోపమా లేదా వేరేదైనా కారణమా?తెలుసుకొనేందుకు ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం నిపుణుల కమిటీతో విచారణకు ఆదేశించింది. ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాలో సుమారు 13 లక్షల ఎకరాలకు నీళ్ళు అందుతాయి. ప్రస్తుతం ఎగువనుంచి ఇంకా వరదనీరు వచ్చి చేరుతోంది. కనుక వరద ప్రవాహం తగ్గిపోయేలోగా కొత్త గేటు అమర్చగలిగితే మళ్ళీ ప్రాజెక్టు నిండుతుంది లేకుంటే ఈ ఏడాది కృష్ణా డెల్టాలో సాగునీటికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. 

తెలంగాణ ప్రభుత్వం సాగునీటికి ఉపయోగించవలసిన నీటితో జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తూ అమూల్యమైన కృష్ణాజలాలను వృధాగా సముద్రంలోకి పారిస్తోందంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పులిచింతల నుంచి లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా పోతోంది. విరిగిన గేటు స్థానంలో తాత్కాలిక గేటు అమర్చేవరకు ఇంకా వృధాగా పోతూనే ఉంటుందని వేరే చెప్పక్కరలేదు.

ఇది చంద్రబాబునాయుడు ప్రభుత్వ నిర్వాకమే అంటూ సాక్షి మీడియా ఆరోపణలు గుప్పిస్తూ నేడు ఓ కధనం ప్రచురించింది. కనుక దీనిపై వైసీపీ, టిడిపిల మద్య రాజకీయ యుద్ధం కూడా మొదలైనట్లే భావించవచ్చు.


Related Post