దళిత బంధు పధకంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు సిఎం కేసీఆర్ వాసాలమర్రి గ్రామస్తులకు దళిత బంధు నిధులు విడుదల చేసి చెంపదెబ్బ కొట్టినట్లు సమాధానమిచ్చారని చెప్పవచ్చు.
సిఎం కేసీఆర్‌కు దమ్ము, చిత్తశుద్ధి ఉంటే హుజూరాబాద్‌లో కాకుండా రాష్ట్రంలో వేరే నియోజకవర్గాలలో ఎక్కడైనా దళిత బంధు పధకం ప్రారంభించాలని కాంగ్రెస్, బిజెపిలు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులలో ప్రభుత్వం ఒకేసారి అంత సొమ్ము ఇవ్వలేదు కనుక ఈ పధకాన్ని అమలుచేయలేక సిఎం కేసీఆర్ అభాసుపాలవుతారని ప్రతిపక్షాలు ఆశించాయని అర్ధమవుతూనే ఉంది. కానీ సిఎం కేసీఆర్ హటాత్తుగా నిన్న వాసాలమర్రి గ్రామంలో పర్యటించి, నేడే ఆ పధకం కింద నిధులు విడుదల చేస్తానని ప్రకటించి వెంటనే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో రూ.10 లక్షల చొప్పున సొమ్ము జమా చేయించి ప్రతిపక్షాలకు పెద్ద షాక్ ఇచ్చారు. సిఎం కేసీఆర్ ఒకే ఒక పర్యటనతో ప్రతిపక్షాలకు నోట మాట రాకుండా చేసినందుకు టిఆర్ఎస్ శ్రేణులు ఆనందంతో పొంగిపోతున్నాయి. సిఎం కేసీఆర్ గట్టిగా నాలుగు రోజులు జిల్లా పర్యటనలు చేస్తే ప్రతిపక్షాల నోళ్ళు మూతపడతాయని మంత్రి కేటీఆర్ అన్న మాటలు ఈ సందర్భంగా గుర్తుచేసుకోక తప్పదు.
నిజానికి ఈనెల 16వ తేదీన హుజూరాబాద్‌లో లక్ష మంది దళితులతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి దానిలో ఈ పధకాన్ని ప్రారంభించాలని అనుకొన్నప్పటికీ, బహుశః ప్రతిపక్షాలకు ధీటుగా జవాబిచ్చేందుకే సిఎం కేసీఆర్ నిన్న హటాత్తుగా వాసాలమర్రిలో పర్యటించి అక్కడ ఈ పధకాన్ని అమలుచేసినట్లు భావించవచ్చు.
ఇప్పుడు రాష్ట్రంలో ఈ పధకం ప్రారంభం అయ్యింది కనుక బహుశః హుజూరాబాద్ ఉపఎన్నికలోగా మరిన్ని నియోజకవర్గాలలో ఈ పధకం కింద ప్రభుత్వం నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. తద్వారా ఉపఎన్నికకు ముందే రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. సిఎం కేసీఆర్‌ని అపర చాణక్యుడని ఊరికే అనలేదని దీంతో అర్దమవుతుంది. కనుక ఇప్పుడు ప్రతిపక్షాలు ఏవిదంగా స్పందిస్తాయో... హుజూరాబాద్ ఉపఎన్నికలో ఏవిదంగా గట్టెక్కుతాయో చూడాలి.