సిఎం కేసీఆర్ ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో దళితవాడలో పర్యటించినప్పుడు ఎవరు ఊహించని విదంగా దళిత బంధు పధకం కింద గ్రామంలో 76 దళిత కుటుంబాలకు రేపటి నుంచే రూ.10 లక్షల చొప్పున సొమ్ము వారి బ్యాంక్ ఖాతాలలో జమా చేస్తామని ప్రకటించారు. ఈనెల 16వ తేదీన హుజూరాబాద్‌లో దీనిని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తామని ప్రకటించి హటాత్తుగా వాసాలమర్రిలో ప్రారంభించడం చాలా ఆశ్చర్యం. దీనికోసం ఇవాళ్లే జీవో జారీ చేసి రేపటి నుంచే సొమ్ము జమాచేయడం ప్రారంభిస్తామని సిఎం కేసీఆర్ ప్రకటించారు.
ఆ సొమ్ములో రూ.10 వేలు చొప్పున కోసుకొని, దానికి ప్రభుత్వం తరపున మరో రూ.10 వేలు జమాచేసి దళిత రక్షణ నిధిని కూడా ఏర్పాటుచేస్తామని సిఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న ఈ సొమ్ముతో ఏమి చేస్తారో వారి ఇష్టమని కానీ దీనిలో ఒక్క పైసా కూడా వృధా చేయకుండా ఈ పధకాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ వృద్ధిలోకి రావాలని సిఎం కేసీఆర్ హితవు పలికారు. దీనిని విజయవంతం చేసి యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలవాలని సిఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
తెలంగాణ ఏర్పడి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కో సమస్యా పరిష్కరించుకొంటూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు కలిగేవిదంగా పధకాలు అమలుచేస్తున్నామని అన్నారు. దళిత బంధు పధకం ఏడాది క్రితమే రూపుదిద్దుకొందని, అయితే కరోనా కారణంగా అమలుచేయడంలో ఆలస్యమైందని సిఎం కేసీఆర్ అన్నారు. ఈ పధకంతో రాష్ట్రంలో దళితులందరూ తప్పకుండా అభివృద్ధి సాధిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ పధకం పొందినవారికి మిగిలిన పధకాలలో కోత విధించబోమని, వాటన్నిటినీ యధావిధిగా ఇస్తుంటామని సిఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. .
అంతేకాదు...గ్రామంలో 100 ఎకరాల ప్రభుత్వ భూమిని 76 దళిత కుటుంబాలకు పంచి ఇస్తామని చెప్పారు. అయితే వేర్వేరుగా కమతాలు పెట్టుకోకుండా కొంతమంది కలిసి ఓ బృందంగా ఏర్పడి సమిష్టి వ్యవసాయం చేసుకోవాలని సిఎం కేసీఆర్ సూచించారు.
ఎర్రవెల్లిలో మాదిరిగానే గ్రామంలో మట్టి ఇళ్ళు అన్నీ కూల్చివేసి ఆరు నెలల్లోగా ప్రతీ కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు కట్టించి ఇస్తామని ప్రకటించారు. గ్రామంలో బీసీలకు కూడా న్యాయం చేస్తామని సిఎం కేసీఆర్ ప్రకటించారు.