బిజెపికి మంత్రి గంగుల సవాల్

August 04, 2021


img

సిఎం కేసీఆర్‌ దళిత బంధు పధకం ప్రకటించిన తరువాత బిజెపికి ఈటల రాజేందర్‌కు ఓటమి భయం పట్టుకొందని అందుకే నియోజకవర్గంలో ఓటర్లకు కుట్టుమిషన్లు, గోడ గడియారాలు పంచిపెడుతున్నారని మంత్రి గంగుల కమలాకర్ ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే ఈటల రాజేందర్‌ ఓటర్ల సానుభూతి పొందేందుకు కొత్త డ్రామా మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. ఇంతవరకు అన్ని రాజకీయ పార్టీలు దళితులను ఓటు బ్యాంకుగా భావిస్తూ వారి ఓట్లతో ప్రధాని, ముఖ్యమంత్రి పదవులు సంపాదించుకొన్నాయే తప్ప ఏనాడూ వారి కష్టానష్టాలను పట్టించుకోలేదని మంత్రి గంగుల ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో అయితే దళితుల పరిస్థితి మరింత దయనీయంగా ఉన్నాయని, వారికి కనీసం త్రాగునీరు, విద్యుత్ వంటి కనీసం సౌకర్యాలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి దళిత వ్యతిరేక పార్టీ కనుకనే ఈ ఏడేళ్ళలో కేంద్రప్రభుత్వం, రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వాలు దళితుల కోసం ఏమి చేయలేదన్నారు. ఒకవేళ రాష్ట్ర బిజెపి నేతలకు దళితులపై అభిమానం ఉన్నట్లయితే దళిత బంధు పధకం కోసం ప్రధాని నరేంద్రమోడీని ఒప్పించి కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు. 

ఓటమి భయంతోనే బిజెపి, ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌లో ఓటర్లకు కుట్టుమిషన్లు, గోడగడియారాలు పంపిణీ చేస్తున్నట్లే, టిఆర్ఎస్‌ కూడా ఓటమి భయంతోనే హడావుడిగా ఈ పధకం ప్రకటించిందని, ఓటమి భయంతోనే సిఎం కేసీఆర్‌ ఈ పధకాన్ని ప్రారంభించేందుకు హుజూరాబాద్‌ను ఎంచుకొన్నారని కాంగ్రెస్‌, బిజెపిలు ఆరోపిస్తున్నాయి. బిజెపి దళితులను మోసం చేస్తోందని గంగుల ఆరోపిస్తుంటే, తెలంగాణ ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానని, దళితులకు మూడేకరాలు ఇస్తామని మాయమాటలు చెప్పి సిఎం కేసీఆర్‌ మోసం చేశారని కాంగ్రెస్‌, బిజెపిలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో దళితులపై అత్యాచారాలు, దౌర్జన్యాలు జరుగుతున్నా టిఆర్ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా దళితుల పరిస్థితి ఏమీ బాగోలేదనే సిఎం కేసీఆర్‌ దళిత బంధు పధకం ప్రకటించామని చెప్పుకొంటున్నారు. మరి బిజెపి పాలిత రాష్ట్రాలను ఏవిదంగా వేలెత్తి చూపగలరు?ఓ పక్క బిజెపిని కేంద్రప్రభుత్వాన్ని తిట్టిపోస్తూ, దళిత బంధు పధకం ద్వారా టిఆర్ఎస్‌ రాజకీయ లబ్ది పొందాలని భావిస్తున్నప్పుడు దానికి మోడీ ప్రభుత్వం నిధులు ఎందుకు ఇవ్వాలి?అని రేపు బిజెపి నేతలు అడగకుండా ఉండరు. కనుక దళితుల సంక్షేమం విషయంలో ఏ పార్టీ కూడా భిన్నంగా వ్యవహరించిందని చెప్పలేము. అందుకే దళితులు సమైక్య పోరాటాలు చేస్తున్నారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌ వంటి ఉన్నతాధికారులు తమ పదవులకు రాజీనామాలు చేసి దళితుల సంక్షేమం కోసం నడుం బిగించవలసివస్తోంది.


Related Post