హైకోర్టు ప్రశ్న... ఆలోచించవలసిందే

August 04, 2021


img

సాధారణంగా న్యాయస్థానాలలో నిత్యం అనేక కేసులు దాఖలవుతుంటాయి. వాటిలో ఏదో అంశంపై ప్రభుత్వాన్ని సవాలు చేస్తూ వేసినవి కూడా ఉంటాయి. ఆయా కేసులలో న్యాయస్థానాలు ప్రభుత్వానికి నోటీసులు, ఆదేశాలు జారీ చేసినప్పుడు కొన్నిసార్లు వాటిని అమలుచేయలేకపోవచ్చు. అప్పుడు న్యాయస్థానాలు దానిని కోర్టు ధిక్కారంగా భావించి జరిమానాలు విధిస్తుంటాయి. ఇది చాలా సర్వసాధారణమైన వ్యవహారమే. అయితే కోర్టుధిక్కారణ కేసులో జరిమానాలు చెల్లించేందుకు ప్రభుత్వం ప్రజాధనాన్ని ఖర్చు చేస్తుండటాన్ని సవాలు చేస్తూ ఓ ఉపాధ్యాయుడు ప్రజాహిత పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ జరిమానాలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.58 కోట్లు విడుదల చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. 

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టీస్ట్ విజయ్ సేన్ రెడ్డిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం దీనిపై బుదవారం విచారణ చేపట్టింది. హైకోర్టు ధర్మాసనం కూడా పిటిషనర్‌ వాదనతో ఏకీభవిస్తూ కోర్టు ధిక్కారణ కేసులకు ప్రభుత్వం ఏ పద్దు కింద రూ.58 కోట్లు మంజూరు చేసింది? దానికి ట్రెజరీ నిబందనలు ఏవిదంగా అనుమతిస్తాయి? అసలు ఏ లెక్కన కోర్టు ధిక్కరానేరాలకి ప్రజాధనాన్ని వినియోగిస్తున్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. 

ఈ కేసులో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌, రెవెన్యూ, ఆర్ధికశాఖ కార్యదర్శులు తదితరులకు హైకోర్టు నోటీసులు జారీ చేసి సంజాయిషీ కోరింది. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 27కి వాయిదా వేసింది.


Related Post