జస్టిస్ ఎన్వీ రమణ సలహా చెవికెక్కుతుందా?

August 03, 2021


img

సాగుకోసం పొదుపు చేసుకోవలసిన కృష్ణా జలాలతో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తూ విలువైన నీటిని వృధాగా సముద్రంపాలు చేస్తోందని ఆరోపిస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. దానిపై నిన్న విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, రెండు తెలుగు రాష్ట్రాలకు ఓ మంచి సలహా చెప్పారు. ఈ సమస్యపై న్యాయస్థానాలలో పోరాడుకోవడం కంటే మధ్యవర్తిత్వంతో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించించారు. ఒకవేళ న్యాయపోరాటానికే మొగ్గు చూపితే, తాను రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినవ్యక్తిని కనుక ఈ కేసును వేరే బెంచీకి బదిలీ చేస్తామని చెప్పారు. 

కానీ ఇది కేవలం నీళ్ళ పంపకాల గురించి జరుగుతున్న పోరాటం మాత్రమే కాదు. దీని నుంచి అధికార టిఆర్ఎస్‌, వైసీపీలు రాజకీయలబ్దిని కూడా ఆశిస్తున్నాయి. ఈ సమస్యతో రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ రగిల్చి హుజూరాబాద్‌ ఉపఎన్నికలో లబ్ది పొందాలని టిఆర్ఎస్‌ ఆశిస్తుంటే, ఏపీలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్న జగన్ ప్రభుత్వం, వాటిపై నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి, తమ ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా తయారైన టిడిపిపై రాజకీయంగా పైచేయి సాధించేందుకు ఈ సమస్యను ఉపయోగించుకొంటున్నాయని చెప్పక తప్పదు. 

ఒకవేళ రెండు ప్రభుత్వాలకు ఈ సమస్య పరిష్కారానికే ప్రాధాన్యం ఇవ్వాలనుకొంటే చర్చలు జరుపుతుండేవి. భారత్‌ను కబళించాలని చూస్తున్న చైనా వంటి శత్రుదేశంతోనే చర్చల ద్వారా సరిహద్దు సమస్యలను పరిష్కరించుకొనేందుకు భారత్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పుడు, ఏడేళ్ళ క్రితం వరకు ఒకే రాష్ట్రంగా ఉన్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఈ సమస్యను పరిష్కరించుకోలేవా?అని ఆలోచిస్తే సాధ్యమేనని అర్ధం అవుతుంది. కానీ రెండు రాష్ట్రాలలో అధికారపార్టీలు ఈ సమస్యతో రాజకీయంగా లబ్ది పొందాలనుకోవడం వల్లనే ఈ సమస్యపై పోరాడుకొంటూ చర్చల ఆలోచనే చేయడం లేదు. ఇది రాజకీయాలతో ముడిపడి ఉంది కనుక జస్టిస్ ఎన్వీ రమణ ఇచ్చిన మంచి సలహాను రెండు రాష్ట్రాలు పాటించకపోవచ్చు.


Related Post