టిఆర్ఎస్‌ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్?

August 03, 2021


img

హుజూరాబాద్‌ ఉపఎన్నిక టిఆర్ఎస్‌కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారడంతో అభ్యర్ధి ఎంపిక విషయంలో సిఎం కేసీఆర్‌ చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఈ ఉపఎన్నికలో కూడా నాగార్జునసాగర్ ఫార్ములానే అమలుచేస్తారని మొదట్లో వచ్చిన ఊహాగానాలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మొదట..కాంగ్రెస్‌ నుంచి యువ నాయకుడు కౌశిక్ రెడ్డిని రప్పించి పోటీ చేయిద్దామనుకొన్నారు కానీ ఆ విషయం ముందే బయటకు పొక్కడంతో అతనికి గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు.

హుజూరాబాద్‌ నుంచి బీసీ వర్గానికి చెందిన విద్యార్ధి నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బరిలో దింపబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోమవారం సిద్ధిపేటలో మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్ నిర్వహించిన హుజూరాబాద్‌ నియోజకవర్గం టిఆర్ఎస్‌ నేతల సమావేశంలో శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఈనెల 16వ తేదీన సిఎం కేసీఆర్‌ హుజూరాబాద్‌లో దళిత బంధు పధకం పైలట్ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నారు. అప్పుడే శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ కాంగ్రెస్‌, బిజెపిలు తమ అభ్యర్ధులను ఖరారు చేసిన తరువాతే టిఆర్ఎస్‌ కూడా తన అభ్యర్ధి పేరు ప్రకటించవచ్చు.

ఈటల రాజేందర్‌ రాజీనామాతో వస్తున్న ఈ ఉపఎన్నిక ఆయనకూ చాలా ప్రతిష్టాత్మకమే కానీ ఓడిపోతే రాజకీయంగా తీరని అప్రతిష్ట. కనుక బిజెపి అభ్యర్ధిగా తన భార్య జమునను పోటీ చేయించవచ్చు. కాంగ్రెస్‌ అభ్యర్ధిగా ఎవరిని బరిలో దింపుతారో ఇంకా తెలియదు కానీ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రస్తుతం అదేపనిలో ఉన్నారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌, బిజెపిలను ఓడించే గెలుపు గుర్రం కోసం ఆయన వెతుకుతున్నారు. బహుశః ఎన్నికల గంట మ్రోగేలో మూడు పార్టీల అభ్యర్ధులు ఎవరనేది స్పష్టత రావచ్చు. 


Related Post