తెలంగాణలో ప్రతిపక్షాల వ్యూహం ఫలించేనా?

August 03, 2021


img

హుజూరాబాద్‌ ఉపఎన్నికలను దృష్టిలో పెట్టుకొని టిఆర్ఎస్‌ ప్రభుత్వం ఆఘమేఘాల మీద చిరకాలంగా పెండింగులో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేస్తోంది. హడావుడిగా దళిత బంధు పధకాన్ని ప్రకటించి, పైలట్ ప్రాజెక్టు పేరుతో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పంపిణీకి సిద్దం అవుతోంది. వీటితో హుజూరాబాద్‌ ఓటర్లను ప్రసన్నం చేసుకోగలమని గట్టి నమ్మకంతో ఉంది. కాంగ్రెస్‌, బిజెపిలు వీటినే తమ ఆయుధాలుగా మలుచుకొని టిఆర్ఎస్‌ ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తుండటం విశేషం. ఇవన్నీ తన రాజీనామా చేయడం వలననే జరుగుతున్నాయని ఈటల రాజేందర్‌ వాదిస్తున్నారు. కనుక ఇప్పుడు కాంగ్రెస్‌, బిజెపి ఎమ్మెల్యేలు కూడా తాము కూడా తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం రాజీనామాలు చేసేందుకు సిద్దమని ప్రకటిస్తున్నారు.  

ముందుగా మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తరువాత ఘోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాలకు సిద్దమని ప్రకటించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గానికి ఇస్తున్నట్లే తమ నియోజకవర్గాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేసి, దళిత బంధు పధకం అమలుచేసే మాటయితే తాము కూడా రాజీనామా చేస్తామని ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

టిఆర్ఎస్‌ ప్రభుత్వంపై ఈవిదంగా ఒత్తిడి చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేయాలనుకోవడం గొప్ప వ్యూహమే కానీ ఎంతో కష్టపడి గెలుచుకొన్న ఎమ్మెల్యే పదవులను వారు వదులుకొంటారనుకోలేము. హుజూరాబాద్‌ ఉపఎన్నిక ముగిసేవరకేవారు ఈ సవాళ్ళు చేస్తుంటారు కనుక వారితో టిఆర్ఎస్‌కు కాస్త ఇబ్బందే తప్ప పెద్ద సమస్య ఏమీ ఉండదనే భావించవచ్చు.


Related Post