ఈటల, బిజెపి కలిసి కొత్త డ్రామా షురూ: మంత్రి హరీష్‌

August 03, 2021


img

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ నిన్న అపోలో ఆసుపత్రిలో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకోవడంపై మంత్రి హరీష్‌రావు భిన్నంగా స్పందించారు. సాధారణంగా ఇటువంటప్పుడు త్వరగా కోలుకోవాలని అంటారు కానీ మంత్రి హరీష్‌రావు మాత్రం ఇదంతా కొత్త డ్రామా అని కొట్టి పడేయడం విశేషం. 

సిద్ధిపేటలో టిఆర్ఎస్‌ భవన్‌లో ఆయన హుజూరాబాద్‌ టిఆర్ఎస్‌ నేతలతో మాట్లాడుతూ, “ఎన్నికలు రాగానే బిజెపికి ఇటువంటి కపట నాటకాలు ఆడటం అలవాటే. ముందుగా ఈటల రాజేందర్‌ తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు బిజెపి ప్రచారం చేస్తుంది. తరువాత ఈటల కాలికి పట్టీలు వేసుకొని వీల్ ఛైర్లో ఎన్నికల ప్రచారం చేస్తూ హుజూరాబాద్‌ ఓటర్ల సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తారు. ఈ కపట నాటకాలతో హుజూరాబాద్‌ ఓటర్లను మభ్యపెట్టి ఓట్లు రాబట్టుకోవాలని చూస్తారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలలో ఇలాంటి కపట నాటకాలు ఆడబోతే అక్కడి ప్రజలు బిజెపిని తరిమికొట్టారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో కూడా అదే జరుగబోతోంది. ఈటల, బిజెపి కలిసి ఆడబోయే ఈ కపట నాటకాలను ప్రజలు గ్రహించలేరనుకోవడం అవివేకం. ఈటల రాజేందర్‌కు సిఎం కేసీఆర్‌ ఎంతో గౌరవం, ప్రాధాన్యత ఇస్తే ఆయన తల్లిలాంటి టిఆర్ఎస్‌ పార్టీని మోసం చేసి వెళ్ళిపోయారు. ఆయనకు ఈ ఉపఎన్నికలో ప్రజలే గట్టిగా బుద్ది చెపుతారు,” అని అన్నారు.    

ఉద్యోగాల కల్పన, సంక్షేమ పధకాల గురించి మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రంలో అమలుచేస్తున్నన్ని సంక్షేమ పధకాలు ఏ ఒక్క బిజెపి పాలిత రాష్ట్రంలోను అమలు చేయలేకపోతున్నారు కానీ ఇక్కడకు వచ్చి అన్నీ కేంద్రప్రభుత్వమే ఇస్తోందంటూ ప్రగల్భాలు పలుకుతుంటారు. అన్నీ కేంద్రప్రభుత్వమే ఇస్తున్నప్పుడు మరి బిజెపి పాలిత రాష్ట్రాలలో కూడా ఇవన్నీ అమలుచేయాలి కదా?కానీ ఎందుకు చేయడం లేదు? కేంద్రప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం లక్షలాది ఉద్యోగాలను కల్పిస్తోంది. ఇప్పటి వరకు 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాము. త్వరలో మరో 50వేల ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తాం. మన ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు బాగా తెలుసు. కనుక మీరు వాటినే మరోమారు హుజూరాబాద్‌ ప్రజలకు గుర్తుచేసి ఓట్లు అడగాలి,” అని మంత్రి హరీష్‌రావు అన్నారు.   

పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కాలికి పట్టీ వేయించుకొని వీల్ ఛైర్లో కూర్చొని ఎన్నికల ప్రచారం చేస్తూ ఓటర్ల సానుభూతి పొంది పార్టీని గెలిపించుకొన్నారు. కనుక ఈటల రాజేందర్‌ కూడా హుజూరాబాద్‌ ఉపఎన్నికలో అలాగే డ్రామా ఆది ఓటర్ల సానుభూతి పొందే ప్రయత్నం చేస్తారని భావిస్తూ టిఆర్ఎస్‌ అప్రమత్తం అయినట్లు మంత్రి హరీష్‌రావు మాటలతో అర్ధం అవుతోంది. 


Related Post