ఉద్యోగాల నోటిఫికేషన్‌ ఎప్పుడో...భర్తీ ఇంకెప్పుడో?

August 02, 2021


img

రాష్ట్రంలో 50,000 ఉద్యోగాల భర్తీ అనే మాట చాలా నెలలుగా వినిపిస్తోంది. అయితే నెలలు గడుస్తున్నా ఇంతవరకు మాటలే తప్ప ఒక్క నోటిఫికేషన్‌ కూడా విడుదల కాలేదు. దీంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశానిస్పృహలతో ఉన్నారు. నోటిఫికేషన్లు వెలువడకపోవడంతో ప్రభుత్వోద్యోగాలకు వయోపరిమితి దాటిపోతున్నవారూ ఉన్నారు. వారు మరింత నిరాశానిస్పృహలతో ఉన్నారు. నిన్న మంత్రివర్గ సమావేశంలో నోటిఫికేషన్ల విడుదలపై నిర్ణయం తీసుకొని ప్రకటన చేస్తారని నిరుద్యోగులు ఆశగా ఎదురు చూశారు కానీ ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు...కనుక ప్రకటన చేయలేదు. దీంతో నిరుద్యోగుల ఆశలు ఆవిరైపోయాయి. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల టిఎస్‌పీఎస్సీకి ఛైర్మన్‌, పాలకమండలి సభ్యులను నియమించినప్పుడు నిరుద్యోగులలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఆ తరువాత 50,000 ఉద్యోగాల భర్తీకి ఖాళీలను గుర్తించి వారం పది రోజులలోగా అన్ని ప్రభుత్వ శాఖలు నివేదికలు తయారుచేసి పంపించాలని ఆదేశించగా అవీ సిద్దం అయ్యాయి. కనుక ఇక నోటిఫికేషన్లు వెలువడటమే ఆలస్యం అని అందరో భావించారు. కానీ ఆ నివేదికలు ఏమయ్యాయో... ఇంతవరకు నోటిఫికేషన్లు ఎందుకు విడుదల కాలేదో... తెలీదు. నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి, అసహనంతో ఉన్నారని తెలిసి ఉన్నప్పటికీ ప్రభుత్వం తరపున ఎవరూ ఇంతవరకు ఆలస్యానికి కారణం తెలియజేయలేదు. ఉద్యోగాల నోటిఫికేషన్లే ఇంతవరకు విడుదల కాకపోతే 50,000 ఉద్యోగాల భర్తీ ఇంకెప్పుడో?


Related Post