కౌశిక్ రెడ్డికి గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవి!

August 02, 2021


img

ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్‌లో చేరిన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. ప్రగతి భవన్‌లో నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో కౌశిక్ రెడ్డిని గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసారు. ఈ మేరకు ప్రభుత్వం కౌశిక్ రెడ్డి పేరును సిఫార్సు చేస్తూ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు ఆమోదం కోసం నిన్నే లేఖ పంపింది. దానికి గవర్నర్‌ ఆమోదముద్ర వేయడం లాంఛనప్రాయమే కనుక కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా అధికారిక ప్రకటన నేడు వెలువడే అవకాశం ఉంది. 

టిఆర్ఎస్‌ పార్టీలో అనేకమంది సీనియర్లు ఎమ్మెల్సీ పదవి కోసం ఏళ్ళ తరబడి ఎదురుచూస్తుండగా కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్‌ పార్టీలో చేరిన వారం రోజులలోనే కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి లభించడం విశేషం. నిజానికి ఆయన హుజూరాబాద్‌ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ అభ్యర్ధిగా బరిలో దిగవలసి ఉంది. కానీ ఆ విషయం ఆయన ముందే మీడియాకు లీక్ చేసుకోవడంతో విమర్శలపాలయ్యారు. ఆ కారణంగా ఆయనను టిఆర్ఎస్‌లో చేర్చుకొంటారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. కానీ కౌశిక్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడమే కాకుండా ఎటువంటి రిస్క్ లేని గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టడం విశేషం. దీనిని బట్టి సిఎం కేసీఆర్‌ ఆయనకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్ధం అవుతుంది. టిఆర్ఎస్‌లో చేరక ముందు కౌశిక్ రెడ్డి హుజూరాబాద్‌ నియోజకవర్గానికి  కాంగ్రెస్‌ ఇన్‌-ఛార్జీగా ఉండేవారు. కనుక కౌశిక్ రెడ్డి హుజూరాబాద్‌ ఉపఎన్నికలో పోటీ చేయనప్పటికీ పార్టీ అభ్యర్ధిని గెలిపించుకోవడంలో కీలకపాత్ర పోషిస్తారని బహుశః సిఎం కేసీఆర్‌ భావిస్తుండటమే ఈ అరుదైన ప్రాధాన్యతకు కారణం కావచ్చు. 


Related Post