మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేసిన ఎన్ఆర్ఐ

August 01, 2021


img

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి అమెరికాకు వెళ్ళి అక్కడ ఐ‌టి కంపెనీని స్థాపించడం మనందరికీ గర్వకారణం కాగా అంత ఉన్నతస్థాయికి ఎదిగినా కన్నతల్లి వంటి తన మాతృభూమిని, ముఖ్యంగా తాను పుట్టి పెరిగిన తెలంగాణ గడ్డకు ఏదో చేయాలనే తపిస్తుండటం ఇంకా గొప్ప విషయం. ఆయనే స్ప్రూస్ ఇన్ఫోటెక్ కంపెనీ అధినేత వేణు సంగని. తమ సంస్థ సామాజిక బాధ్యతగా ఆయన రామగుండం నియోజకవర్గంలో జనగామ గ్రామంలో శనివారం  25 మంది మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. 

విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్ప్రూస్ ఇన్ఫోటెక్ అధినేత వేణు సంగని తరపున ఆయన సోదరుడు వెంకట్ సంగని, మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, నగర మేయర్ బంగి శివకుమార్, డెప్యూటీ మేయర్ అభిషేక్ తదితరులు హాజరయ్యారు. 


మహిళలు కూడా తమ కాళ్లపై తాము నిలబడి ఆర్ధిక స్వావలంభన సాధించాలనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమం చేపట్టామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం నియోజకవర్గంలో ప్రతీ మహిళా కూడా తన కాళ్ళపై తాను నిలబడాలని కోరుకొంటున్నానని, కుట్టుపని నేర్చుకొనేందుకు ఆసక్తి ఉన్న ప్రతీ మహిళకు విజయమ్మ ఫౌండేషన్ ద్వారా కుట్టు శిక్షణ ఇప్పించి కుట్టు మిషన్లు అందజేస్తామని చెప్పారు. కుట్టు మిషన్లు అందజేసినందుకు వేణు సంగనికి, ఆయన సోదరుడు వెంకట్ సంగనికి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. 


స్ప్రూస్ ఇన్ఫోటెక్ కంపెనీ అధినేత వేణు సంగని అమెరికాలో స్థిరపడినప్పటికీ రాష్ట్రంలో అనేక ఏళ్ళుగా ఇటువంటి పలు సేవాసహాయ కార్యక్రమాలకు తోడ్పడుతునే ఉన్నారు. గత నెల తమ సంస్థ తరపున రామగుండంలోని ప్రభుత్వాసుపత్రులు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు అందించారు. 

స్థానికంగా నివశిస్తున్న ఆయన సోదరుడు వెంకట్ సంగని, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తదితరులు నియోజకవర్గంలోని సమస్యలను, అవసరాలను గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. కోరుకంటి చందర్ తన సతీమణి పేరిట స్థాపించిన విజయమ్మ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలో నిరుపేదలు, నిసహాయులను గుర్తించి వారికి ఆసక్తి ఉన్న రంగాలలో అవసరమైన శిక్షణ ఇప్పిస్తుండగా, అమెరికాలో స్థిరపడిన స్ప్రూస్ ఇన్ఫోటెక్ కంపెనీ అధినేత వేణు సంగని యధాశక్తిన వారికి ఈవిదంగా తోడ్పాటు అందిస్తూ పుట్టి పెరిగిన తెలంగాణ గడ్డకు, ప్రజలకు సేవలందిస్తున్నారు. మన ఆలోచన, ఆశయంలో చిత్తశుద్ది ఉన్నట్లయితే దేవుడు కూడా సహకరిస్తాడని చెప్పేందుకు ఇదే ఓ గొప్ప నిదర్శనం.


Related Post